ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పత్రిక తెరపైకి రానుంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కోసం పని చేసేందుకు నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో దినపత్రిక ముందుకు రానుంది.
తెలుగు సమాజంలో మీడియా రాజకీయంగా, కులపరంగా విడిపోయింది. టీడీపీ, వైసీపీ అనుకూల మీడియాలుగా కొన్ని పత్రికలు, చానళ్లు పని చేస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ కోసం నమస్తే తెలంగాణ పత్రిక ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించేందుకు తనకంటూ ఓ మీడియా సంస్థ అవసరమని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో నమస్తే ఆంధ్రప్రదేశ్ అనే పత్రికను తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిసిందే. ఇప్పటికే అనుమతులు కూడా పొందినట్టు సమాచారం. ఎడిటోరియల్ సిబ్బంది, ఫీల్డ్‌లో పనిచేసే రిపోర్టర్స్ నెట్‌వర్క్, ఇతర విభాగాల విషయమై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రధాన కారకుడిగా కేసీఆర్ ఆ ప్రాంత సమాజం గుర్తిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ సమాజంపై కేసీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఏపీలో అడుగు పెట్టడానికి నాటి కేసీఆర్ దురుసు వ్యాఖ్యలు అడ్డంకిగా మారాయి. దీంతో తనను తాను ప్రమోట్ చేసుకోడానికి సొంతంగా ఏపీలో ఓ మీడియా వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం వుందని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో వుంది.
ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో సాధ్యమైనంత త్వరగా నమస్తే ఆంధ్రప్రదేశ్ అవతరించే అవకాశం ఉంది.