‘సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గుర్తించను. అందుకే ఆయన్ను జగన్‌రెడ్డి అనే పిలుస్తాను. జగన్‌రెడ్డి తన పద్ధతులు మార్చుకునేంత వరకు సీఎంగా గుర్తించే ప్రశ్నే లేదు’ అని జనసేనాని పవన్‌కల్యాణ్ అనేక సందర్భాల్లో అన్న మాటలివి.
సీఎంగా పవన్ గుర్తించరు కానీ, అలా చేయండి, ఇలా చేయండి, లేకపోతే తాట తీస్తానని హెచ్చరిస్తుంటాడు. ఏపీలో మూడు రాజధాని కేంద్రాలు ఉండొచ్చేమోనని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. దీనిపై వరుస ట్వీట్లతో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు ఆగాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అసలు సీఎంగానే గుర్తించకుండా ఏ హోదాలో జగన్ సర్కార్‌కు విజ్ఞప్తి చేస్తున్నారో అర్థం కావడం లేదు.
వ్యూహం లేకుండా ఎలా ఉంటుంది?
‘జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన ఒక వ్యూహం ప్రకారమే చేశారు. ఉత్తరాంధ్ర భూములు చాలావరకూ వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని స్థానికులు చెప్పారు. విశాఖ ప్రాంతంలో భూములపై కఠినంగా ఉన్న జేసీ శివశంకర్ లోతేటిని ఆఘమేఘాలపై తప్పించారు. ఇక అక్కడ పులివెందుల పంచాయితీలు మొదలవుతాయి’ అని పవన్ ట్వీట్ చేశారు.
ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా వ్యూహాలు లేకుండా ముందుకు ఎలా పోతారు? పార్టీలు, ప్రభుత్వాలే కాదు…వ్యక్తులైనా ఓ ప్రణాళిక, ఆలోచన లేకుండా ఏ పనీ చేయరు కదా! మరి జగన్‌రెడ్డి గారు అసెంబ్లీలో ఒక వ్యూహం ప్రకారమే ప్రకటన చేశారని ట్వీట్ చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
పవన్ నోట పులివెందుల పంచాయితీ
ఇపుడు బాబు మాటను పవన్ ఎత్తుకున్నాడు. జగన్ సర్కార్‌పై చంద్రబాబు పదేపదే పులివెందుల పంచాయితీ అనడం వింటున్నాం. ఇపుడు అదే విమర్శను పవన్ కూడా చేయడం గమనార్హం. ఇలా మాట్లాడిన బాబుకు రాయలసీమ వాసులు ఏ గతి పట్టించారో ఒకసారి పవన్ తెలుసుకుంటే మంచిది.