తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్నికల ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్లుగా కనిపించడంలేదని అంటున్నారు. చంద్రబాబు తీరు చూస్తే జనం అనవసరంగా జగన్ కి ఓటు వేశారని, ఓ విధంగా తప్పు చేసారన్న వైఖరే ఎపుడూ కనిపిస్తుంది. ఆయన బాటలో నడిచే తమ్ముళ్ళు సైతం ఆ విధంగానే తానా తందానా అంటున్నారు. ఇక పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉత్తరాంధ్రా జిల్లాలు ఉన్నాయి.
వెనకబాటుతనానికి మారు పేరులా ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పాలనా రాజధానిని తీసుకువస్తానని ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రతిపాదనపైన ఈ ప్రాంతం టీడీపీ నేతలు నోరు ఎత్తకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. సాక్షాత్తు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. మరి ఈ ప్రాంతం అభివ్రుధ్ధిని బాటలు వేస్తామని వైసీపీ సర్కార్ చెబుతూంటే కళా కనీస స్పందన లేకపోవడాన్ని అంతా గమనిస్తున్నారు.
మరో వైపు అసెంబ్లీ లోపలా బయటా జగన్ మీద ఒంటికాలిపైన లేచే అచ్చెన్నాయుడు సైతం విశాఖకు పరిపాలన రాజధాని ప్రతిపాదనపైన ఇంతవరకూ నోరు విప్పలేదు. మరి ఆయనకు ఇది ఇష్టమా. లేక అనుకూలంగా మాట్లాడితే చంద్రబాబుకు కష్టమని ఊరుకున్నారో తెలియడంలేదని అంటున్నారు.
ఇంకోవైపు దారుణమైన పరిస్థితులు ఉన్న విజయనగరం జిల్లా నుంచి మాజీ మంత్రి సుజన క్రిష్ణ రంగారావు వంటి వారు సైతం జగన్ చేసిన ప్రతిపాదన తమకు అనుకూలమా, ప్రతికూలమా అన్నది ఎందుకు చెప్పలేకపోతున్నారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి ఈ ప్రాంతాలు ఎప్పటికీ బాగుపడకూడదని తమ్ముళ్ళు అనుకుంటున్నారా అని వైసీపీ నేతలే గట్టిగా నిలదీస్తున్నారు.
ఇక విశాఖకు చెందిన సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ గా పేరున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతం ఈ ప్రతిపాదనపై మౌనంగానే ఉండడం విచిత్ర పరిణామమే. ఇది రాజకీయమైన ఎత్తుగడా లేక బాబుకు భయపడి టీడీపీ నేతాశ్రీలు నోరు చేసుకోవడంలేదా అన్న సందేహాలు కూడా పుట్టుకువస్తున్నాయి.
మొత్తం మీద ఉత్తరాంధ్ర విషయంలో అధికారంలో ఉన్నన్నాళ్ళూ అన్యాయం చేసిన టీడీపీ నేతలు ఇపుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అలాగే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. పసుపు పార్టీలో ఉన్న వారిలో మొనగాడిలా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రమే జగన్ నిర్ణయానికి స్వాగతం చెప్పడం ఇక్కడ విశేషం.