నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సొంత పార్టీనే తిడుతూ వార్తల్లో నలగడం జేసీ దివాకర్ రెడ్డి స్టయిల్. టీడీపీలో ఉంటూ చంద్రబాబును తిట్టడం, జగన్ ను మెచ్చుకోవడం లాంటి ఎన్నో పనులు ఇదివరకే చేశారు జేసీ. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు అతడ్ని నలుగురిలో పలుచన చేశాయి.
ఓ కార్యక్రమంలో మాట్లాడిన జేసీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో బూట్లు నాకిస్తామంటూ అవమానకర రీతిలో మాట్లాడారు. ఈ విషయంలో ఎవర్నీ విడిచిపెట్టేది లేదంటూ సవాల్ కూడా చేశారాయన. దీంతో పోలీసు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా జేసీకి రక్షణగా పోలీసులు పనిచేస్తున్నారని, అలాంటి పోలీసు వ్యవస్థపై జేసీ ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
తన అహంకారానికి జేసీ ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకున్నారని, అయినా ఆయనకు బుద్ధి రాలేదంటున్నారు పోలీసు సంఘం నేతలు. తన వ్యాఖ్యలతో జేసీ, ఓ జోకర్ లా మారిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టమన్న సంఘం నేతలు, జేసీపై కేసులు వేస్తామని.. అవసరమైతే క్రిమినల్ కేసుల వరకు వెళ్తామని హెచ్చరించారు. తమ పనితీరు ఎలా ఉందో తెలియాలంటే, వచ్చి స్పందన కార్యక్రమం చూడాలని అంటున్నారు.
జేసీలా దిగజారి మాట్లాడడం తమకు చేతకాదంటున్న సంఘం నేతలు, తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి మద్దతు దక్కింది. జేసీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గతంలో చింతమనేనిని సమర్షించిన చంద్రబాబు, ఈసారి జేసీని కూడా వెనకేసుకొస్తారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.