దయచేసి వేచి ఉండండి.. వెనక్కి తగ్గిన పవన్

తినడానికి మెతుకుల్లేక తండ్రి ఏడుస్తుంటే కొడుకొచ్చి పరమాన్నం కావాలన్నాడంట.. అంటూ ముతక సామెతతో రాజధాని వ్యవహారంపై విమర్శలు సంధించిన జనసేనాని వెనక్కి తగ్గారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా విషం చిమ్మిన పవన్ కు సోషల్…

తినడానికి మెతుకుల్లేక తండ్రి ఏడుస్తుంటే కొడుకొచ్చి పరమాన్నం కావాలన్నాడంట.. అంటూ ముతక సామెతతో రాజధాని వ్యవహారంపై విమర్శలు సంధించిన జనసేనాని వెనక్కి తగ్గారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా విషం చిమ్మిన పవన్ కు సోషల్ మీడియా స్ట్రోక్ బాగానే తగిలినట్టుంది. దీంతో పవన్ కల్యాణ్ ఈరోజంతా సైలెంట్ గా ఉన్నారు, సాయంత్రానికి నెమ్మదించి ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు.

రాజధాని తరలిపోతోందని రైతులంతా ఆందోళనతో ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రాజధాని ప్రాంత రైతులను సముదాయించడానికి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశామని, ఈనెల 20న ఆ కమిటీ పర్యటించి ఓ నివేదిక ఇస్తుందని ట్వీట్ చేశారు. పనిలో పనిగా సీఎం జగన్ ఏర్పాటు చేసిన కమిటీ తమ పని పూర్తి చేసి నివేదిక ఇచ్చే వరకు ఎవరూ ఆవేశ పడొద్దని కూడా సూచించారు.

దయచేసి వేచి ఉండండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్. ఇప్పటికే పవన్ రాజధాని విషయంలో చాలా తొందర పడ్డారు. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. రాజధానిని నాశనం చేస్తున్నారని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే ఈ పన్నాగం పన్నారని అర్థం వచ్చేలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అయితే అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అన్నట్టుగా పవన్ కామెంట్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్లు చేసుకోవచ్చు కానీ, ఏపీకి మూడు రాజధానులు ఉండకూడదా అని సెటైర్లు పడ్డాయి. దీంతో పవన్ వెనక్కి తగ్గారు. చంద్రబాబు కూడా మరీ దూకుడుగా వ్యవహరించకపోవడంతో.. పవన్ ఆలోచనలో పడ్డారు. సాయంత్రానికి తేరుకుని కొత్త స్టేట్ మెంట్ తో జనం ముందుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దామంటున్నారు జనసేనాని. అందులో పొందుపరిచిన నిర్ణయాలను బట్టి స్పందిద్దాం అంటూ శాంతి వచనాలు పలుకుతున్నారు. 24గంటలు గడవక ముందే పవన్ లో వచ్చిన ఈ మార్పు చూసి జనసైనికులే ఆశ్చర్యపోతున్నారు. అలా ఎలా రాజధాని తరలిస్తారంటూ ఆవేశంగా పోస్ట్ లు పెట్టిన పవన్, నివేదిక వచ్చాక స్పందిస్తానంటున్నారు.

చంద్రబాబులా యూ-టర్న్ తీసుకోవడం అలవాటు చేసుకున్నారా లేక, తాను చేసింది తప్పు అని తెలుసుకున్నారా.. ఆ మర్మం ఏంటో పవన్ కే తెలియాలి.