దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణం అయిన పౌరసత్వ చట్టం సవరణల విషయంలో సుప్రీం కోర్టు కూల్ గా రియాక్ట్ అయ్యింది. ఈ చట్టం పై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించడం గమనార్హం. ఈ చట్టం కోర్టు ముందు నిలిచే అవకాశమే లేదని బీజేపీయేతర పార్టీలు అభిప్రాయపడుతూ వచ్చాయి. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని.. ఇందులో మతపరమైన వివక్ష ఉందని.. కాబట్టి ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం చెల్లదని లాయర్లు అయిన కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు.
ఈ చట్టం లోక్ సభలో ఆమోదం పొందగానే కొంతమంది కోర్టుకు ఎక్కారు. చట్టాన్ని సవాల్ చేశారు. మరోవైపు అంతలోనే దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అవి హింసాత్మకంగా మారాయి.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందిస్తూ ఒక వర్గం వారే అల్లర్లు చేస్తున్నారని తేల్చారు. ఇక ఈ చట్టంపై తగ్గేది లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. ఇలాంటి నేఫథ్యంలో ఈ చట్టంపై సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం
విచారణ మొదలుపెట్టింది.
చట్టం అమలుపై స్టే కోరుతూ చాలా మంది పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వారందరికీ కోర్టు ఆశాభంగాన్ని కలిగించింది. చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు ధర్మాసనం నో చెప్పింది. దీంతో చట్టం అమల్లో ఉన్నట్టే.
అంతే కాదు.. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి నెలకు వాయిదా వేసింది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఇరవై రెండో తేదీన తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం వాయిదా వేసింది.
దీంతో ఈ చట్టం పై వాదోపవాదాలకు కూడా ఇప్పుడప్పుడే ఆస్కారం లేదు. స్టే విధించలేదు, తదుపరి విచారణకు ఇంకా ముప్పై రోజులకు పైగా గడువు. ఈ నేపథ్యంలో..ఆందోళనల ఆ లోపు సద్దుమణిగే అవకాశాలున్నాయి. అయితే ఈ చట్టం పై విచారణకు మాత్రం సుప్రీ ధర్మాసనం ఒప్పుకుంది. అసలు కథ ఇక కోర్టులో తేలాల్సిందే. కానీ ఇప్పుడే కాదు! నెల తర్వాతే!