తానేం మాట్లాడినా ఏం కాదులే అనే మొండి ధైర్యమే పట్టాభికి దెబ్బలు తీసుకొచ్చాయి. సీఎం జగన్ అంతటి నాయకుడిని పట్టుకుని బండబూతులు తిడితే…న్యాయస్థానానికి అలా వెళ్లి, తెల్లారేసరికి తిరిగి రావడమే పట్టాభి నోరు పారేసుకోడానికి బలాన్ని ఇచ్చింది. బహుశా పట్టాభి పప్పులో కాలేసిందెక్కడంటే… టీడీపీలో వల్లభనేని వంశీని దగ్గరగా చూడకపోవడమే. టీడీపీలో పట్టాభి యాక్టీవ్ అయ్యే నాటికి వల్లభనేని వంశీ ఆ పార్టీని వీడినట్టుగా వుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వంశీని హెచ్చరిస్తూ పట్టాభి మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ వీడియోలో ఏమున్నదంటే… “సైకోలతో పోటీ పడడానికి లోకేశ్ స్థాయేంటి? నీ (వల్లభనేని)స్థాయి ఏంట్రా? లోకేశ్ దాకా ఎందుకు? ఇవాళ నారా లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపే నేను గన్నవరం వస్తా. అక్కడ నీ సంగతేంటో తేలుస్తా. లోకేశ్ దాకా ఎందుకురా? రేపు చంద్రబాబు, నారా లోకేశ్ ఆదేశిస్తే… నేను గన్నవరంలో పోటీకి రెడీ. నీకు డిపాజిట్ రాకుండా చేస్తా. గన్నవరం నుంచి నిన్ను ప్యాకప్ చేయించి బయటికి విసిరేసేదాకా విశ్రమించేది లేదు” అని ప్రగల్భాలు పలికారు.
అసలు వంశీ… మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నాయకుడు. కనీసం పట్టాభి పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు. కానీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అప్పటికైనా పట్టాభి మేల్కొని వుంటే, ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. వంశీ ఏమన్నారంటే… “విజయవాడలో వాగినట్టు గన్నవరంలో మాట్లాడితే కుదరదు. ఒకవేళ గన్నవరంలో వాగితే దాని ప్రతిఫలం ఏంటో చూస్తారు?” అని వంశీ తన మార్క్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
తన మాదిరే వంశీ ఉత్తుత్తి వార్నింగ్లు ఇచ్చే రకం కాదని, బహుశా ఇప్పుడు పట్టాభికి అనుభవంలోకి వచ్చి వుంటుంది. నిజానికి గన్నవరంలో టీడీపీ కార్యాలయంపైకి దాడి జరిగింది కూడా పట్టాభి కోసమే అని ప్రచారం జరుగుతోంది. అదృష్టం కొద్దీ వైసీపీ శ్రేణుల చేతికి పట్టాభి అప్పుడు చిక్కలేదు. ఇప్పుడు పోలీసుల చేతిలో తనకేదో అయ్యిందని వాపోతున్నారు. వాడు, వీడు అంటూ వంశీని అనకపోయి వుంటే ఆయన కూడా ఏమీ పట్టించుకుని వుండేవారు కాదు.
ఏదైనా అనుభవంలోకి వస్తేనే, తత్వం బోధపడేది. చెబితే వినేవాళ్లు లోకంలో తక్కువయ్యారు. అయినా కొట్టడానికి వంశీ ఎవరు? కొట్టించుకోడానికి పట్టాభి ఎవరు? అంతా రాత ప్రకారమే జరుగుతోందని కర్మ సిద్ధాంతం ఒకటి తెరపైకి వచ్చింది. అంతేగా మరి! మనమంతా నిమిత్తమాత్రులం.