రాజధాని విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో భూకంపాన్ని పుట్టిస్తున్నట్టుగా ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీలోని కొంతమంది నేతలు జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అయితే తప్పు పడుతున్న వారిలో ఒక కులం నేతలే ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నారు.
చంద్రబాబు హయాంలో రాజధానిగా ప్రకటించబడిన అమరావతి ప్రాంతంలో భూములు ముందే కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లుజగన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతలు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు.
వారిలో తప్పక సమర్థిస్తున్న వారు కూడా కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ జాబితాలో చేరారు మాజీ ఉపముఖ్యమంత్రి, తెలుగుదేశం నేత కేఈ ప్రభాకర్. కర్నూలులో హై కోర్టు ఏర్పాటును ఆయన స్వాగతించారు. ఈ అంశం విషయంలో తాము పోరాడినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు హయాంలో కర్నూలు లో హై కోర్టు కావాలంటూ రాయలసీమ వాసులు డిమాండ్ చేసినా కేఈ లాంటి వాళ్లు కిక్కురుమనలేదు.
శ్రీబాగ్ ఒడంబడికను చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కినా వీళ్లు మాట్లాడలేదు. ఇప్పుడు కర్నూలుకు హై కోర్టును జగన్ కేటాయించగానే.. పోరాడినట్టుగా ఈయన చెప్పుకోవడం గమనార్హం.ఇక ఇప్పటికే గంటా కూడా వైజాగ్ విషయంలో స్వాగతించారు.
తెలుగుదేశం పార్టీ నేతల సంగతెలా ఉన్నా..మూడు ప్రాంతాలకూ సమ్మతం అయ్యే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. తెలుగుదేశం, పవన్ కల్యాణ్ లు ఈ విషయంలో ఏం చెప్పినా.. ప్రజలు జగన్ నిర్ణయంతో హర్షిస్తూ ఉన్నారు. ఒకరకంగా ప్రతిపక్ష పార్టీల విషయంలో జగన్ నిర్ణయం భూకంపాన్నే పుట్టించింది.