ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. వికేంద్రీకరణ అంశాన్ని తాము స్వాగతిస్తున్నట్టుగా ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. రాయలసీమలో హై కోర్టును ఏర్పాటు చేయాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్టుగా ఆయన అన్నారు.
గత ప్రభుత్వాన్ని కూడా ఈ డిమాండ్ చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుందని.. ఆయన అన్నారు.గతంలో రాజధాని విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తూ ఉందని జీవీఎల్ అన్నారు.
గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బేఖాతరు చేస్తే.. జగన్ ప్రభుత్వం మాత్రం దాన్ని అమలు చేస్తూ ఉందని జీవీఎల్ అన్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేయాల్సిందల్లా అమరావతి రైతులకు భరోసా అని జీవీఎల్ అన్నారు.అమరావతి లో శాసనవ్యవస్థను మాత్రమే ఉంచుతామని జగన్ ప్రకటించారని… ఈ విషయం మీద కూడా మరింత స్పష్టత అవసరమన్నారు.
రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం గురించి కేంద్రం జోక్యం చేసుకోలేదు అని జీవీఎల్ తేల్చి చెప్పారు. మోడీ జోక్యం చేసుకోవాలంటూ కొందరు తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో జీవీఎల్ వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా మారాయి. ఏతావాతా రాజధాని విషయంలో ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని.. జీవీఎల్ అన్నారు.