నిజానికి మూడు వ్యవస్థలకు మూడు ప్రాంతాల్లో రాజధానులు వస్తే గనుక.. మూడు ప్రాంతాలూ అంతో ఇంతో కేంద్రీకృతంగా అభివృద్ధికి నోచుకుంటాయి.ఇది ఎవ్వరికైనా స్ఫురించే కామన్ సెన్స్. ఒకే చోట సమస్తం కేంద్రీకృతం అయితే.. ఆ ఒక్క ప్రాంతం గురించి తతిమ్మా మొత్తం రాష్ట్ర ప్రజలు అసూయ చెందే ప్రమాదం చాలా ఉంటుంది.
చంద్రబాబునాయుడు తన పాలనలో చేసిన పాపం అదే. ఆ పాపాన్ని ఇప్పుడు చక్కదిద్దడానికి జగన్ ప్రయత్నిస్తోంటే.. చంద్రబాబు విలపిస్తున్నారు.ఇలాంటి ప్రతిపాదన ఇవాళ్టిది కాదు. తొట్టతొలుత ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన రోజుల్లోనే ఇలాంటి ఆలోచన చేశారు.
రాజధాని, యూనివర్సిటీ, హైకోర్టు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు విడివిడిగా కేటాయించాలనేదతి అప్పట్లో శ్రీబాగ్ ఒప్పందంలో పెద్దలు తీసుకున్న నిర్ణయం. ఆమేరకే రాయలసీమ- కర్నూలులో రాజధాని, ఆంధ్ర- గుంటూరులో హైకోర్టు, ఉత్తరాంధ్ర- విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడ్డాయి.
తర్వాతి రోజుల్లో పరిస్థితులు మారాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అన్నీ ఒకటే చోటకు చేరాయి. హైదరాబాదు మాత్రం యావత్ రాష్ట్రానికి అభివృద్ధి కేంద్రంగా నిలిచింది. ప్రాంతాలవారీగా అసమతుల్య అభివృద్ధి సాగింది. అసంతృప్తులు ప్రాంతాల వారీగా పెరిగాయి.
గతంలో హైదరాబాదు కేంద్రంగా తొమ్మిదేళ్లు సీఎంగా పాలించిన చంద్రబాబునాయుడుకు ఇలాంటి అసమానతల్ని చక్కదిద్దడానికి అపూర్వమైన అవకాశం లభించింది. కానీ ఆయన ఆ అవకాశాన్ని ఘోరంగా దుర్వినియోగం చేసుకున్నారు. తన హయాంలో చేయగలిగినదంతా హైదరాబాదులోనే కేంద్రీకృతం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో.. సీమాంధ్ర మొత్తం వ్యతిరేకించడానికి కారణం అలాంటి పనులే.
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు అదే తప్పు రిపీట్ చేశారు. రాష్ర్టం ఏర్పడిన తొలినాటి నుంచి.. అధికార వికేంద్రీకరణ కోసం ప్రజలనుంచి డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఆయన వాటినన్నింటినీ తుంగలో తొక్కారు. అమరావతి ఒక్క ప్రాంతం మీదనే తన దృష్టి మొత్తం పెట్టారు.
దీని వల్ల.. ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర నుంచి ప్రజల అసంతృప్తులకు ఆయన కారణమయ్యారు. ఆ ప్రాంతాల సమతుల్య అభివృద్ధి గురించి ఏదో కాకమ్మ కబుర్లు చెప్పారే తప్ప.. క్రియాశీలంగా ఏం చేయలేదు. ఆ పాపాలను చక్కదిద్దడానికి జగన్ ఇప్పుడు మూడు రాజధానుల ఆలోచన చేస్తోంటే.. మళ్లీ దీనిని కూడా తప్పు పడుతూ చంద్రబాబు మరో పొరబాటు చేస్తున్నారు.