‘‘విశాఖపట్టణం నియోజకవర్గం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీచేస్తా. ఇండిపెండెంటుగా అయినా సరే పోటీచేసి తీరుతా. ఇతర రాజకీయ పార్టీలు నా ఆలోచనలకు దగ్గరగా ఉంటే అప్పుడు వారి పార్టీ తరఫున పోటీచేసే సంగతి ఆలోచిస్తా..’’ ఇది సీబీఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ తాజా స్టేట్మెంట్. గత ఎన్నికల్లో విశాఖపట్టణం ఎంపీ బరిలో 2.88 లక్షల ఓట్లు సాధించి ఓడిపోయిన జెడి లక్ష్మీనారాయణ అదంతా తన బలమే అని అనుకుంటున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఈసారి ఇండిపెండెంటుగా అయినా పోటీచేస్తా అని డైలాగులు కొడుతున్నారు.
ఇతర పార్టీలు నా ఆలోచనలకు దగ్గరగా ఉంటే అప్పుడు వారి తరఫున పోటీచేయడం గురించి ఆలోచిస్తా.. అని ఆయన అనడం గమనిస్తే.. ఎంతగా ఓవరాక్షన్ చేస్తున్నారో కదా అనిపిస్తుంది. ఆయనను మించిన మొనగాడు లేడని.. పార్టీలే ఆయన ఆలోచనలకు దగ్గరగా వచ్చి, ఆయనను అభ్యర్థిగా బతిమాలాలి అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. జెడి లక్ష్మీనారాయణకు కోసం వేరే గత్యంతరం లేనట్టుగా అంతగా ఎగబడే దుస్థితిలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో ఏమున్నాయి?
జెడి లక్ష్మీనారాయణకు తనకు సొంతంగా ప్రజల్లో కొంత మంచి పేరు ఉంటే ఉండవచ్చు గాక. కానీ, ఆయనను మంచిగా చూస్తున్న వాళ్లందరూ జగన్ వ్యతిరేకులు. ఆటోమేటిగ్గా తెలుగుదేశం అభిమానులు. ఆ ఓటు బ్యాంకు ఆ పార్టీకే పోతుంది. ఆయన ఇండిపెండెంటుగా పోటీచేస్తే గత ఎన్నికల్లో దక్కిన ఓట్లలో కనీసం సగమైనా దక్కించుకోగలరా? అనేది పలువురి అభిప్రాయంగా ఉంది.
నిజానికి గత ఎన్నికలకు ఇప్పటికి విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరంగా పరిస్థితుల్లో చాలా తేడా వచ్చింది. అప్పట్లో వైసీపీ అభ్యర్థి మూర్తి, తెలుగుదేశానికి చెందిన భరత్ పై కేవలం నాలుగువేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. ఒక రకంగా చెప్పాలంటే.. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టే. జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ విస్తృతప్రచారం దన్నుగా జెడి లక్ష్మీనారాయణ 2.8 లక్షల ఓట్లు చీల్చుకున్నప్పటికీ.. వైసీపీకి కేవలం నాలుగువేల మెజారిటీ వచ్చిందంటే… అర్థం చేసుకోవచ్చు. కానీ అప్పటికీ ఇప్పటికీ రాజకీయ వాతావరణం విశాఖలో మారింది.
విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చేయాలనే జగన్ సంకల్పానికి అక్కడి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. విశాఖ అభివృద్ధిని అడ్డుకునే విపక్షాల కుట్రలను కూడా గమనిస్తున్నారు. ఇప్పటిదాకా విశాఖ రాజధానికి అనుకూలంగా తన గళం వినిపించకుండా, అమరావతి రాజధానే మంచిదని అంటూ వస్తున్న జెడి లక్ష్మీనారాయణ అక్కడ ఎంపీగా పోటీచేసి, అది కూడా ఇండిపెండెంటుగా, ఎలా గెలవగలనని అనుకుంటున్నారో అర్థం కాదు. పార్టీల ఆశ ఫలించదు.. పోటీచేయాలనిపిస్తే ఇండిపెండెంటుగానే చేయాల్సి వస్తుంది. దానికి డిసైడ్ అయి ఆయన వ్యూహరచన చేసుకుంటే మంచిది.