జ‌గ‌న్‌, కేసీఆర్ మ‌ధ్య చెడిన స్నేహం – ఇదే సాక్షి

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్ మ‌ధ్య స్నేహం చెడిందా? అంటే “అవును” అనే స‌మాధానం వ‌స్తుంది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఏపీ స‌ర్కార్ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తెలంగాణ…

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్ మ‌ధ్య స్నేహం చెడిందా? అంటే “అవును” అనే స‌మాధానం వ‌స్తుంది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఏపీ స‌ర్కార్ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోపంగా ఉన్నార‌ని తెలుస్తోంది. 

చంక‌లో పిల్లిలా జ‌గ‌న్‌ను పెట్టుకోవ‌చ్చ‌ని భావించిన కేసీఆర్ … త‌న ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా జ‌గ‌న్ న‌డుచుకోక పోవ‌డంతో అల‌క వ‌హించార‌ని తెలుస్తోంది. అంతేకాదు ఇరు రాష్ట్రాల్లోని సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌పై కేంద్రంతో పాటు ఇత‌ర‌త్రా సంస్థ‌ల‌కు రెండు తెలుగు రాష్ట్రాలు ప‌ర‌స్పరం ఫిర్యాదు చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి కేసీఆర్ వ‌చ్చి ఆశీర్వ‌దించి వెళ్లారు. ఆ త‌ర్వాత కేసీఆర్ నేతృత్వంలో హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో పాటు మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. దీంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య ఓ సుహృద్భావ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే క‌ర‌వు పీడిత రాయ‌ల‌సీమ‌కు సాగునీటిని అందించే ల‌క్ష్యంతో రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని చేప‌ట్టాల‌ని ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యించ‌డంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదానికి దారి తీసింది.

ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చినా రెండు రాష్ట్రాల మ‌ధ్య ఆర్టీసీ బ‌స్సులు న‌డ‌ప‌డానికి తెలంగాణ స‌ర్కార్ ఏవో సాకులు చెబుతూ అడ్డంకులు సృష్టిస్తోంది. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్‌ను ఇరుకున పెట్టాల‌నే కేసీఆర్ స‌ర్కార్ బెట్టుకుపోతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అందుకే తెలంగాణ‌కు ఆర్టీసీ బ‌స్సులు ఎప్పుడు న‌డుపుతార‌నే మీడియా ప్ర‌శ్న‌కు ర‌వాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ …. అది అంతులేని ప్ర‌శ్న‌గా మిగిలింద‌ని, ఆ విష‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను అడ‌గాల‌ని సెల‌విచ్చారు. నాని మాట‌ల‌ను బ‌ట్టి ప్ర‌స్తుతం రెండు రాష్ట్రాల మ‌ధ్య సంబంధాల‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నార‌నేందుకు తాజాగా మ‌రో ఉదంతాన్ని ఉద‌హ‌రించుకోవ‌చ్చు. స్వ‌చ్ఛ అవార్డుల‌లో దేశంలోనే తెలంగాణ మొద‌టి స్థానం ద‌క్కింది. ఇలా నిల‌వ‌డం తెలంగాణ‌కు ఇది మూడో సారి. తెలంగాణ స‌ర్కార్ అవార్డును స్వీక‌రించే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌త్రిక‌ల‌కు అడ్వ‌ర్‌టైజ్‌మెంట్స్ ఇచ్చింది.  

త‌న ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌ను ప‌క్క‌న పెడితే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిల‌కు కూడా తెలంగాణ స‌ర్కార్ ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. కానీ జ‌గ‌న్‌కు సంబంధించిన సాక్షి ప‌త్రిక‌కు మాత్రం యాడ్ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కాలం న‌మ‌స్తే తెలంగాణ‌తో పాటు సాక్షికి త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ వ‌చ్చారు.

కానీ ఇప్పుడు సాక్షికి ఇవ్వ‌లేదంటే కేవ‌లం జ‌గ‌న్‌పై కోపంతోనే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సాక్షి తెలంగాణ ఎడిష‌న‌ల్‌లో ల‌లితా జ్యువెల్ల‌రికి సంబంధించిన ఫుల్ పేజీ యాడ్స్‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. కానీ పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివ‌ద్ధిశాఖ‌కు సంబంధించిన యాడ్స్‌కు మాత్రం సాక్షి నోచుకోలేదు.  కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య స‌హ‌వాసం చెడింద‌నేందుకు ఇదే నిలువెత్తు “సాక్షి”. 

నిశ్శబ్దం – నిరుత్సాహం