రాహుల్‌ను చూడు లోకేశ్ … ట్వీట్ కాదు ఫైట్ చేయాలి

కాంగ్రెస్ జాతీయ నాయ‌కుడు రాహుల్‌గాంధీ ఒక్క‌సారిగా దేశ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించారు. దేశంలో అప్ర‌క‌టిత నియంతృత్వ పాల‌న సాగిస్తున్న మోడీ స‌ర్కార్‌పై రాహుల్‌గాంధీ నుంచి ఇలాంటి ఫైటింగ్ స్పిరిట్ కావాలంటూ దేశ ప్ర‌జలు ముక్త‌కంఠంతో…

కాంగ్రెస్ జాతీయ నాయ‌కుడు రాహుల్‌గాంధీ ఒక్క‌సారిగా దేశ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించారు. దేశంలో అప్ర‌క‌టిత నియంతృత్వ పాల‌న సాగిస్తున్న మోడీ స‌ర్కార్‌పై రాహుల్‌గాంధీ నుంచి ఇలాంటి ఫైటింగ్ స్పిరిట్ కావాలంటూ దేశ ప్ర‌జలు ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు. ఏ మాట‌కామాట చెప్పాలంటే … నిన్న రాహుల్‌గాంధీ, ఆయ‌న సోద‌రి ప్రియాంక గాంధీ వీధికెక్కి చేసిన పోరాటం చూస్తే ముచ్చ‌టేస్తుంది.

సంక్షోభ‌, సంక్లిష్ట స‌మయాల్లోనే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఆ ప‌రిస్థితుల‌కు ఎదురొడ్డి నిలిచిన వాళ్లే నాయ‌కులుగా పుట్టుకొస్తారు. అప్ర‌జాస్వామిక పాల‌న‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌జ‌ల‌కు తామున్నామ‌నే భ‌రోసా క‌ల్పించిన‌ప్పుడే వారి ప్రేమాభిమానాల‌ను చూర‌గొనే అవ‌కాశం ఉంటుంది. 

ఇంత‌కాలం రాహుల్‌ను ప‌ప్పు అన్న‌వాళ్లే , ఇప్పుడు శ‌భాష్ అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా, ఇదే ర‌క‌మైన అభిప్రాయం మ‌న చంద్ర‌బాబునాయుడు త‌న‌యుడు లోకేశ్‌పై జ‌నాల్లో ఉంది. మ‌రి ఎప్పుడైనా లోకేశ్ ఇలాంటి చొర‌వ క‌న‌బ‌రిచారా? క‌నీసం సొంత పార్టీ శ్రేణుల‌కైనా ఓ భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారా? అని ప్ర‌శ్నించుకుంటే …. ప్చ్ అనే పెద‌వి విరుపే స‌మాధానం.

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌తిరోజూ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ ఏపీలో ద‌ళితుల‌పై దాడులు, హ‌త్య‌లు, బీసీల‌పై కేసులు అని నెత్తీనోరూ కొట్టుకుంటూ ప్ర‌జ‌ల్ని న‌మ్మించేందుకు కిందామీదా ప‌డుతున్నారు. మ‌రి ఏపీలో అన్ని నేరాలు, ఘోరాలు జ‌రుగుతుంటే క‌నీసం లోకేశ్ నేతృత్వంలోనైనా ఒక్క పోరాట‌మైనా ఎందుకు చేయ‌లేక పోయారు?

కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌చారంలో ఉన్న రాహుల్‌గాంధీ నిన్న చేసిన పోరాటం యావ‌త్ దేశాన్ని ఆక‌ర్షించిందంటే … అందులో కార్యాచ‌ర‌ణ ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్ర్‌సలో ఓ 19 ఏళ్ల దళిత అమ్మాయిని అగ్రవర్ణాలకు చెందిన నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్ చేయ‌డంతో పాటు చంప‌డంతో యావ‌త్ దేశ‌మంతా ర‌గిలిపోతోంది. స‌రిగ్గా ప్ర‌జాభిప్రాయాన్ని రాజ‌కీయంగా క్యాష్ చేసుకునేం దుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావించిన రాహుల్‌, ఆయ‌న సోద‌రి ప్రియాంక త‌మ స్థాయీభేదాల‌ను మరిచి రోడ్డెక్కారు.  

బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న రాహుల్‌, ప్రియాంక‌ల ప‌ట్ల పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని దేశం మొత్తం క‌ళ్లార్ప‌కుండా వీక్షించింది. ఇందిరాగాంధీ కుటుంబం ప‌ట్ల ఇంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తారా అనే ఆవేద‌న‌, ఆక్రోశం సామాన్య ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.  

ఢిల్లీ-నొయిడా ఎక్స్‌ప్రెస్ హైవేపై రాహుల్‌, ప్రియాంక కాన్వాయ్‌ని పోలీసులు అడ్డ‌గిస్తే … అక్క‌డే దిగి కాలిన‌డ‌క‌న బాధిత యువ‌తి గ్రామానికి వెళ్తాన‌ని అడుగులు ముందుకేశారు. అక్క‌డి నుంచి ఆ గ్రామం దాదాపు 150 కి.మీ ఉండ‌డం గ‌మ‌నార్హం. అయినా రాహుల్ ప‌ట్టువీడ‌క‌పోవ‌డంతో పోలీసులు దుర్మార్గంగా ఆయ‌న్ను తోసి ప‌డేశారు.

యమునా ఎక్స్‌ప్రె్‌స్ హైవేపై కాలిన‌డ‌క వెళుతున్న రాహుల్‌ను ప్రియాంక‌తో పాటు వేలాది మంది ప్ర‌జ‌లు అనుస‌రించ‌డం దేశంలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు నిద‌ర్శ‌నం.  ఇదే స‌మ‌యంలో రాహుల్‌ లాల్చీని, భుజాలను పట్టుకుని పోలీసులు ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు.

ఆ తోపులాట‌లో రాహుల్ నేల మీద ప‌డ్డారు. అయినా రాహుల్ , ప్రియాంక ప‌ట్టు వీడ‌లేదు. అన్నాచెల్లెళ్లు హైవేపైనే కాసేపు బైఠాయించడంతో- ఉద్రిక్తత నెలకొంది. తాజా ఘ‌ట‌న‌తో రాహుల్‌లో  మోడీకి ప్ర‌త్యామ్నాయం చూస్తున్నామ‌ని సోష‌ల్ మీడియాలో హోరెత్తుతోంది.

మ‌రి ఈ ప‌ని లోకేశ్ ఎందుకు చేయ‌లేక‌పోతున్నారు. అంటే తాము చేస్తున్న విమ‌ర్శ‌ల్లో ఎంత డొల్ల‌త‌నం ఉందో చంద్ర‌బాబు, లోకేశ్‌ల ట్వీట్లు, వీడియో స‌మావేశాలే తెలియ‌జేస్తున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌పై దేశ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిప‌డు తున్న ఆగ్ర‌హ జ్వాల ఎవ‌రో ప‌నిగ‌ట్టుకుని ర‌గిల్చింది కాదు. అది ప్ర‌జాగ్ర‌హం నుంచి ఉద్భ‌వించిన అగ్ని. ఎక్క‌డైనా ప్ర‌జావ్య‌తిరేక విధానాలు వుంటే వ్య‌తిరేక‌త దానంత‌టే పుట్టుకొస్తుంది.

దాన్ని తెలివిగా వాడుకున్న వాళ్లే నాయ‌కులుగా ఎదుగుతారు. ఏపీలో ప్ర‌తిప‌క్షాలు, విప‌క్ష మీడియా నానా యాగీ చేస్తున్న‌ట్టుగా … దుర్మార్గ ప‌రిస్థితులేవీ లేవు. ఏపీలో ఏదో జ‌రిగిపోతున్న‌ట్టు వీళ్లంతా కృత్రిమ సంఘ‌ట‌న‌ల‌ను సృష్టిస్తున్నార‌ని ప్ర‌జ‌లు గ్ర‌హిం చారు. కానీ లోకేశ్ మాత్రం ట్వీట్ల‌కే ప‌రిమితం కావ‌డం ఆయ‌న నిర్ల‌క్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. 

క‌నీసం తాము న‌మ్మి విమ‌ర్శ‌లు చేస్తున్న వాటిపై పోరాటం చేయ‌డానికి  భావి టీడీపీ నాయ‌కుడైన లోకేశ్ ముందుకు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. వ‌య‌సు రీత్యా తండ్రి ఇంటికే ప‌రిమితమైతే, త‌న‌యుడు కూడా తండ్రితో పాటు ఉండ‌డం ఏంటో ఏమీ అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు కావాల్సింది ట్వీట్ కాదు ఫైట్ అని రాహుల్‌ను చూసైనా నేర్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఎందుకంటే ట్వీట్ ఓట్లు రాల్చ‌దు. ఫైట్ మాత్ర‌మే ప‌ది ఓట్ల‌ను తెచ్చి పెడుతుంది. 

నిశ్శబ్దం – నిరుత్సాహం