టీడీపీలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనసు చంపుకుని ఉండలేక పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ రాజీనామా చేయడంతో ఇలాంటి అభిప్రాయాలకు మరింత బలం కలుగు తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు అంటే మొదటి నుంచి గల్లా అరుణకుమారి విభేదిస్తూ వచ్చారు. బాబుది కన్నింగ్ మెంటాలిటీ అనే అభిప్రాయం ఆమెలో బలంగా ఉందని చెబుతారు. పైగా గల్లా కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ రాజకీయాలకు అలవాటు కావడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
గల్లా అరుణకుమారి …చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక నేత. గల్లా అరుణ తండ్రి పాటూరి రాజగోపాలనాయుడు చిత్తూరు జిల్లా రాజకీయ ఉద్దండుడిగా పేరు. రాజగోపాలనాయుడు జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. గల్లా తండ్రి రాజగోపాల్‌నాయుడు 1977లోనూ, 1980లోనూ ఎంపిగా ఉన్నారు. అనంతరం తండ్రి వారసురాలిగా గల్లా అరుణ రాజకీయాల్లో ప్రవేశించారు.
1989లో రాజకీయ ప్రవేశం చేసిన ఆమె ఆ సంవత్సరం చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1994లో ఓటమిపాలయ్యారు. తిరిగి 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. దివంగత వైఎస్సార్ సోదరిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసి తనయుడు గల్లా జయదేవ్‌తో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
2014లో గల్లా అరుణ చంద్రగిరి అసెంబ్లీ, ఆమె కుమారుడు గుంటూరు పార్లమెంట్ స్థానాల నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. తనయుడు గెలుపొందగా, తల్లి మాత్రం ఓటమి పాలయ్యారు. చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలను నానికి అప్పగించడాన్ని గల్లా అరుణ జీర్ణించుకోలేక పోయారని అప్పట్లో వార్తలొచ్చాయి. సుదీర్ఘ కాలం పాటు చంద్రగిరితో పెంచుకున్న అనుబంధాన్ని చంద్రబాబు కుట్రపన్ని తెగ్గొట్టారని గల్లా తన సన్నిహితుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.
ఒక దశలో టీడీపీకి రాజీనామా చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి గల్లా అనుచరులంతా మద్దతు పలికారు. దీంతో వైసీపీకి గల్లా అరుణ మద్దతు పలికారని టీడీపీ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాజయం కావడంతో ఏ ఒక్కరిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోయింది. అయితే చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతో గల్లా అరుణకుమారి అంతర్గతంగా విభేదిస్తున్నారని సమాచారం. కేవలం కొడుకు కోసం టీడీపీలో గల్లా కొనసాగుతున్నారని ఆమె సన్నిహితుల మాట. తాజాగా పొలిట్‌బ్యూరో పదవికి రాజీనామా సమర్పించిన నేపథ్యంలో … ఆమె చెబుతున్న కారణాలను బాగా పరిశీలిస్తే, పార్టీపై ఆమె అసంతృప్తిని అర్థం చేసుకోవచ్చంటున్నారు.
చురుగ్గా తిరగలేకపోతున్నా , వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేశానని ఆమె చెప్పారు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబే ఎక్కడా తిరగడం లేదు. హైదరాబాద్‌లో ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడాన్ని అందరూ చూస్తున్నారు. కరోనా భయం బాబును గడప దాటి బయటికి రానివ్వడం లేదని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. అలాంటప్పుడు గల్లా అరుణ చురుగ్గా తిరగకపోవడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
ఇక వ్యక్తిగత కారణమని చెప్పడంలోనే , పార్టీపై అయిష్టాన్ని నర్మగర్భంగా చెప్పినట్టైందని గల్లా అనుచరులు చెబుతున్నారు. గల్లా అరుణకుమారి పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో … ఆమె కుటుంబం వేయనున్న రాజకీయ అడుగులపై రకరకాల ప్రచారం జరుగుతోంది. వాటి అన్నింటికి కాలమే జవాబు చెప్పాల్సి వుంది.