ఉత్తరం ఊపేస్తొంది..దక్షిణం దంచికొడుతోంది..పడమర పరుగులు తీస్తోంది. ఇదంతా ఎందుకంటే మహా విశాఖలో తెలుగుదేశం పార్టీ రాజకీయ దిగులు, గుబులు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైకిల్ దిగేశారు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు రెడీ అవుతున్నారు. పార్టీ పదవి కట్టబెట్టినా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మీద ఎందుకో అధినాయకత్వం డౌట్ పడుతోందిట.
ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రా టీడీపీ కంచుకోటను కాపాడే ఏకైక దిక్కుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడునే నమ్ముకుంటున్నారుట. గత వారం ఆయన పేరు ప్రకటించాల్సిఉన్నా చినబాబు బ్రేకేశాడని అన్నారు. ఇపుడు చూస్తే ఏ బాబూ కాపాడలేని స్థితిలోకి ఉత్తరాంధ్రా వచ్చేసిందని తమ్ముళ్ళ గగ్గోలుతో పార్టీ పెద్దన్న బాధ్యతలు అచ్చెన్నకు కట్టబెడుతున్నారని టాక్.
ఈ నెల 4న అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా చేస్తూ చంద్రబాబు ప్రకటన చేస్తారని అంటున్నారు. ఈ సమాచారం ముందే చేరడంతో అచ్చెన్నాయుడు హడావుడిగా అమరావతికి బయల్దేరారని అంటున్నారు. మొత్తానికి ఎన్ని రకాలుగా చూసినా ప్రస్తుత పరిస్థితుల్లో అచ్చెన్నను మించిన మొనగాడు లేడని టీడీపీ మొత్తం అభిప్రాయపడడం కింజరాపు ఫ్యామిలీకి గర్వకారణమే.
అయితే ఆయన్ని ఆరో వేలుగా ఉంచి అంతా మేమే అంటేనే గొడవలు వస్తాయని అంటున్నారు. తనకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తేనే పదవిని చేపడతానని అచ్చెన్న కండిషన్ పెట్టినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఉత్తరాంధ్ర సహా ఏపీలో టీడీపీని లేపే కొండంత బాధ్యతను అచ్చెన్న నెత్తిన పెట్టనున్నారన్న మాట.