మేయర్ మాటలకు తలా తోకా ఉందా?

విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాదులో ఒక దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల పసివాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా కుక్కలు చుట్టుముట్టి కొరికి చంపేశాయి. వీధి కుక్కలను అరికట్టడంలో జిహెచ్ఎంసి వైఫల్యానికి పరాకాష్ట వంటి దుర్ఘటన…

విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాదులో ఒక దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల పసివాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా కుక్కలు చుట్టుముట్టి కొరికి చంపేశాయి. వీధి కుక్కలను అరికట్టడంలో జిహెచ్ఎంసి వైఫల్యానికి పరాకాష్ట వంటి దుర్ఘటన ఇది. ఇలాంటి సంఘటన జరిగినందుకు జిహెచ్ఎంసి పాలకులు సిగ్గుపడాలి. కానీ వారికి అలాంటి ఆలోచన ఉన్నట్లుగా కనిపించడం లేదు. పైగా పసి బాలుడిని కుక్కలు చంపేసిన ఈ దుర్ఘటనకు సంబంధించి వారు చెబుతున్న వివరణ గమనిస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది.

ఇంతకు హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏం సెలవిస్తున్నారంటే.. ఆకలిగా ఉండటం వల్లనే కుక్కలు ఆ పసి బాలుడును చంపి తినేశాయట! ఈ ఘటనకు జిహెచ్ఎంసి వైఫల్యానికి సంబంధం లేదని చాటుకోవడానికి మేయర్ విజయలక్ష్మి ప్రయత్నిస్తున్నారో ఏమో తెలియదు గానీ.. చెబుతున్న వివరణ మాత్రం చాలా ఘోరంగా ఉంది.

‘‘వీధి కుక్కలను అరికట్టడంలో జిహెచ్ఎంసి చాలా ఘోరంగా విఫలమైంది’’ అనే మాట వాస్తవం. అలాగని ఒప్పుకోవడం వారికి ఇష్టం లేదు. రకరకాలుగా బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డుమీద తన మానాన తాను నడుచుకుంటూ వెళుతున్న నాలుగేళ్ల పిల్లవాడు- కుక్కలకు తినే పదార్థం లాగా కనిపించాడని మేయర్ విజయలక్ష్మి వివరణను బట్టి మనం అనుకోవాల్సి వస్తోంది. 

ఇవాళ ఈ పిల్లవాడిని భోజనం చేసిన కుక్కలు, రేపు ఆకలి వేస్తే మరొక పిల్లవాడిని వెతుక్కోకుండా ఉంటాయని ఏమిటి గ్యారెంటీ? అలా నలుగురు పిల్లలను తిన్న తర్వాత.. మామూలుగా కుక్కలకు దొరికే తిండికంటే ఇలా పిల్లలను తినేయడం రుచికరంగా ఉన్నదని ఆ కుక్కలు మరిగి, దానికే అలవాటు పడితే.. ఎవరు సమాధానం చెప్తారు. మేయర్ ఇంత బాధ్యతా రహితంగా మాట్లాడడం ఏమాత్రం బాలేదు. 

ఇలాంటి వివరణ ఇవ్వడం ద్వారా బాధ్యతగల మేయర్ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు. “వీధి కుక్కలకు తిండి పెట్టండి.. అవి మిమ్మల్ని తినేయకుండా వదిలిపెడతాయి” అనే సందేశాన్ని గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మేయర్ అందిస్తున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది.

వీధి కుక్కలను అరికట్టడం చేతకాక ప్రజల మీదికే నెట్టేసే దుర్మార్గమైన వ్యవహారం ఇది. ఈ పలాయన వాదం మానుకుని ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.