అమెరికా అధ్యక్ష ఎన్నికల సంగ్రామం వాడీవేడీగా మారిన వేళ ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా వైట్ హౌస్ ప్రకటించింది. ప్రస్తుతం వారు క్వారెంటైన్లో ఉన్నట్టుగా పేర్కొంది. అమెరికాలో కరోనా వ్యాప్తి గతంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టింది. మరోవైపు వ్యాక్సిన్ పై చర్చ జరుగుతూ ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలోనూ కరోనా ప్రభావం కీలకమైన అంశంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ కరోనా బారిన పడినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఆరు నెలల కిందటే ట్రంప్ తొలి సారి కరోనా టెస్టు చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన పాల్గొన్న ఒక సదస్సులో పాల్గొన్న జర్నలిస్టు ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ట్రంప్ కు కూడా పరీక్షలు చేశారప్పట్లో. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో ట్రంప్ ధీమాగానే పాల్గొన్నారు.
ఇప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాధినేతలు , కీలక రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. బ్రిటన్ ప్రధాని కరోనా కు గురై ఆ తర్వాత కోలుకున్నారు. ఇండియాలోనూ ప్రముఖ నేతలు, ఎంపీలు కరోనాకు గురయ్యారు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ అనదగ్గ అమెరికా అధ్యక్షుడికి కూడా ఇబ్బంది తప్పినట్టుగా లేదు.
మరోవైపు ట్రంప్ కు కరోనా పాజిటివ్ అనే వార్తలు అమెరికాతో సహా వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజ్ అంటూ నిన్న మార్కెట్లకు జోష్ లభించగా, ట్రంప్ కు కరోనా అనే వార్తలతో పరిస్థితి రివర్స్ అయినట్టుగా ఉంది.