సంవత్సరం – 2013, ఆగస్ట్..స్థలం – ముంబయి, ఇండియా..సరిగ్గా ఇదే నెలలో.. ముంబయిలోని ఇంట్లో దర్శకుడు అనురాగ్ కశ్యప్.. తనను రేప్ చేయడానికి ప్రయత్నించాడంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె ఏకంగా మహారాష్ట్ర గవర్నర్ ను కలవడంతో పాటు పలువురు రాజకీయ నేతల మద్దతు కూడా కూడగట్టుకుంది. అయితే ఇప్పుడీ కేసులో ఊహించని ట్విస్ట్ పడింది.
పాయల్ ఆరోపిస్తున్న అదే సంవత్సరం, అదే నెలలో తను శ్రీలంకలో ఉన్నట్టు ప్రకటించాడు దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఏదో ఒకట్రెండు రోజులు కాదు, ఆ నెలంతా తను శ్రీలంకలోనే ఉన్నానని, ఓ సినిమా పని మీద అక్కడకు వెళ్లినట్టు అనురాగ్ తెలిపాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో ఈ దర్శకుడు.. తన టూర్ కు సంబంధించిన అన్ని ఆధారాల్ని సమర్పించాడు.
పాయల్ రేప్ కేసుకు సంబంధించి నిన్న సుదీర్ఘంగా 8 గంటల పాటు వెర్సోవా పోలీసులు, అనురాగ్ ను విచారించారు. ఈ విచారణలో తనపై వచ్చిన ఆరోపణల్ని పూర్తిగా ఖండించిన కశ్యప్.. ఆ టైమ్ లో ఆ నెలంతా తను శ్రీలంకలో ఉన్నట్టు పోలీసులకు వెల్లడించాడు. శ్రీలంకలో తను ఉంటే, ముంబయిలో ఉన్న పాయల్ ను ఎలా రేప్ చేస్తానంటూ ప్రశ్నించాడు. ఈ మేరకు పాయల్ తరఫు లాయర్.. ప్రియాంక అన్ని సాక్ష్యాధారాల్ని పోలీసులకు సమర్పించారు.
అనురాగ్ సమర్పించిన ఆధారాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. అందులో విమాన టిక్కెట్లు, రెస్టారెంట్ ఇన్-వాయిస్ లు ఉన్నాయి. అంతేకాదు.. శ్రీలంకలో తను బస చేసిన హోటల్ కు సమీపంలో ఖరీదైన బార్ ఉందట. ఆ బార్ బిల్లును, అనురాగ్ తరఫున, అతడి నిర్మాత చెల్లించాడు. ఆ రశీదుల్ని కూడా పోలీసులకు సమర్పించారు. ప్రస్తుతం పోలీసులు, ఈ ఆధారాల కచ్చితత్వంపై ఎంక్వయిరీ చేస్తున్నారు.
అనురాగ్ ఇక్కడితో ఆగడం లేదు.. తన ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు, చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టించేలా పాయల్ వ్యవహరించిందని ఆరోపిస్తూ ఆమెపై రివర్స్ లో కేసు వేయబోతున్నాడు. ఈ మేరకు అనురాగ్ తరఫు న్యాయవాది ఈరోజు సవివరణ ప్రకటన చేశారు. దీనిపై పాయల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.