బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నుంచి నిజాలు రాబట్టేందుకు ఎలాంటి టెస్టులు నిర్వహించాలో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఏకరువు పెడుతున్నారు. తనని లైంగికంగా కశ్యప్ వేధించాడని పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణలే కాదు … పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో వెర్సోవా పోలీస్‌స్టేషన్‌లో అనురాగ్ కశ్యప్‌ను ఎనిమిది గంటల పాటు పోలీస్ అధికారులు విచారించారు. లైంగిక వేధింపులకు సంబంధించి కశ్యప్ నుంచి వివరాలు రాబట్టేందుకు గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే పాయల్ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని కశ్యప్ గట్టిగా చెప్పినట్టు సమాచారం.
పాయల్ ఆరోపించినట్టు … ఆ సమయంలో తాను అసలు ఇండియాలో లేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఆ సమయంలో తాను వేరే దేశంలో ఉన్నట్టు బాలీవుడ్ డైరెక్టర్ స్పష్టం చేశారని తెలిసింది.
ఈ నేపథ్యంలో పాయల్ మరోసారి ట్విటర్ ద్వారా ఘాటుగా స్పందించారు. పోలీసుల విచారణలో కశ్యప్ అబద్ధాలు చెప్పాడన్నారు. వాస్తవాలు బయటపడాలంటే కశ్యప్‌ని నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని కోరుతున్నానని పాయల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి పోలీస స్టేషన్లో తన లాయర్ అప్లికేషన్ ఇవ్వనున్నాడని పాయల్ తెలిపారు.
పాయల్ వ్యాఖ్యలను కశ్యప్ ఖండించారు. 2013 ఆగస్ట్‌లో షూటింగ్ నిమిత్తం శ్రీలంకకు వెళ్లినట్టు చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించి ఆధారాలను పోలీసులకు ఇచ్చినట్టు తెలిపాడు. పాయల్‌తో తానెప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని మరోసారి ఆయన స్పష్టం చేశాడు.