హత్రాస్ అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వాధికారులు బెదిరిస్తున్న వైనం కూడా బయట పడుతూ ఉంది. ఇప్పటికే దళిత యువతి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించి ప్రజాగ్రహానికి గురయ్యారు యూపీ పోలీసులు. అంత్యక్రియల విషయంలో కూడా పోలీసులు బాధిత యువతి కుటుంబాన్ని బెదిరించారని స్పష్టం అవుతూ ఉంది.
ఈ విషయంపై అలహాబాద్ హై కోర్టు కూడా స్పందించింది. యూపీ పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే యూపీ పోలీసులు ఆమెపై అత్యాచారం జరగలేదనే వాదన వినిపిస్తున్నారు. కానీ ఆమె మరణ వాంగ్మూలంలో తన పై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసినట్టుగా, వారి పేర్లను కూడా ఆమె వివరించినట్టుగా ఇది వరకూ పోలీసులే ప్రకటించారు. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు తీసుకున్న వాంగ్మూలం ప్రకారం.. ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమె స్వయంగా చెప్పినట్టుగా పోలిస్ స్టేట్ మెంట్ లోనే పేర్కొన్నారు.
ఇప్పుడు మాత్రం ఆమెపై అత్యాచారం జరిగిందనడానికి సాక్షాధారాలు లేవని యూపీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు! మృతదేహాన్ని వారు అర్ధరాత్రి ఎందుకు దహనం చేశారో ఇప్పుడు క్లారిటీ వస్తున్నట్టుగా ఉంది. ఆ కేసును పూర్తిగా పక్కదోవ పట్టించడానికే అర్ధరాత్రి అంత్యక్రియలను నిర్వహించారనే వాదనకు బలం చేకూరుస్తున్నారు పోలీసులు.
ఇక ఈ కేసులో తాము చెప్పినట్టుగా స్టేట్ మెంట్ ఇవ్వాలని బాధిత కుటుంబాన్ని స్థానిక ప్రభుత్వాధికారులు బెదిరిస్తున్న వైనానికి సంబంధించి వీడియోలు బయటకు వచ్చాయి. మీడియా ఈ రోజే ఉంటుందని, రేపు స్థానికం గా ఉండేదెవరో గుర్తుంచుకుని, స్టేట్ మెంట్ ఇవ్వాలంటూ బాహాటంగానే అధికారులు బెదిరింపులకు దిగిన వీడియోను ఎన్డీటీవీ ప్రసారం చేసింది.
అత్యంత కిరాతానికి బలైన ఒక యువతి కులమేదైనా ఆమెపై కనీస సానుభూతి లేకుండా, ఆమె మృతదేహాన్ని పోలీసులే కాల్చేసి, ఇప్పుడు తాము కోరినట్టుగా స్టేట్ మెంట్ ఇవ్వాలనే బెదిరింపులు కూడా చేస్తూ.. యూపీలో ఉన్న వ్యవస్థ ఎలాంటిదో దేశానికి చాటి చెబుతున్నారు అక్కడి ప్రభుత్వాధికారులు, పోలీసులు! ఈ పాటి యూపీ ప్రభుత్వానికి దక్షిణాది నుంచి బీజేపీ భక్తులు హరతులు ఇస్తుంటారు, దిష్టి తీస్తుంటారు!