తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నారో ఏపీలో సామాన్యులకు కూడా స్పష్టం అయిపోతూ ఉంది. ఏది చేసినా అతిగా చేయడం చంద్రబాబుకు అలవాటు అని తెలకపల్లి రవి లాంటి పరిశీలకులు ఈయన కాంగ్రెస్ తో అంటకాగినప్పుడే వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు చంద్రబాబు నాయుడు సాగిలా పడినప్పుడే ఈ వ్యాఖ్యలు వినిపించాయి. చంద్రబాబు ఎందుకు అతి చేస్తున్నారనే ఆశ్చర్యాన్ని వారు వ్యక్తం చేశారు.
కట్ చేస్తే.. ఆ అతికి తగ్గ రాజకీయ ఫలితాలను చంద్రబాబు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరో రకమైన ఓవర్ చేస్తున్నారు. అదే బీజేపీ ప్రాపకం కోసం పడుతున్న పాట్లు. ఇవి కూడా అతిగానే ఉన్నాయి! ఈ క్రమంలో తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ సీటును బీజేపీకి ఉచితంగా ఆఫర్ చేశారట చంద్రబాబు!
బీజేపీకి ఉచితంగా మద్దతును ఇస్తారట. తిరుపతి సీట్లో తెలుగుదేశం నెగ్గి చాలా కాలం అయిపోయింది. ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే అక్కడ టీడీపీ నెగ్గింది. అది 1984లో! ఆ తర్వాత మళ్లీ తిరుపతి లోక్ సభ సీట్లో టీడీపీ నెగ్గలేకపోయింది. గత ఎన్నికల్లో అయితే చిత్తు చిత్తుగా ఓడింది. ఇప్పుడు అక్కడ టీడీపీ పోటీ చేసినా చేయకపోయినా పెద్ద తేడా ఉండదు. అందుకే బీజేపీకి ఈ సీటును బిస్కెట్ గా వేస్తున్నారట చంద్రబాబు.
ఇక్కడ చంద్రబాబు వ్యూహం ఏమిటో స్పష్టం అవుతోంది. ఒకవేళ చంద్రబాబు వేసే ఈ బిస్కెట్ కు బీజేపీ పడితే ఆ పార్టీకి అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. వాస్తవానికి లోక్ సభలో బీజేపీకి కొత్తగా అదనపు బలం అక్కర్లేదు కూడా. ఇలాంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు తెలివిగా విసురుతున్న ఈ బిస్కెట్ ను ఆశించి, బరిలోకి దిగితే.. బీజేపీ మరోసారి చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకుపోవడం మొదలైనట్టే!