ముగ్గురు ఎంపీలు తలోదారి అయితే ఎట్టా బాబూ..?

టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు పిట్టల్లా ఎగిరిపోతున్నారనే విషయం ఈపాటికే అర్థమైంది. ఇప్పుడు ఎంపీలు కూడా తలోదారి వెతుక్కునే పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని గతంలోనే చంద్రబాబుపై ట్విట్టర్లో యుద్ధం ప్రకటించారు. అధినేత…

టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు పిట్టల్లా ఎగిరిపోతున్నారనే విషయం ఈపాటికే అర్థమైంది. ఇప్పుడు ఎంపీలు కూడా తలోదారి వెతుక్కునే పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని గతంలోనే చంద్రబాబుపై ట్విట్టర్లో యుద్ధం ప్రకటించారు. అధినేత చెప్పుడు మాటలు వింటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నాని. అయితే ఆ తర్వాత ఏమయిందో మొత్తానికి సైలెంట్ అయ్యారు.

ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యవహారం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఏకంగా టీడీపీ అధ్యక్ష స్థానానికే పోటీపడి ఆ తర్వాత నాకు తెలియకుండా అంతా జరిగింది అంటూ సైలెంట్ అయ్యారు రామ్మోహన్ నాయుడు. ఇప్పటికీ రామ్మోహన్ నాయుడంటే లోకేష్ కి పడదు. అందుకే రామ్మోహన్ నాయుడు కూడా పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్టే ఉంటున్నారు.

ఇక చివరిగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వంతు వచ్చింది. జయదేవ్ రాజధాని అమరావతికి భారత చిత్ర పటంలో చోటు సంపాదించారని టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటుంటారు. అయితే ఆ ఘనతని ఆయన ఎప్పుడూ పార్టీకి ఆపాదించలేదు. తమ సొంత విజయంగానే గల్లా గ్రూప్ ప్రచారం చేసుకుంటుంది.

ఇక జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి.. టీడీపీ పోలిట్ బ్యూరో పదవికి తాజాగా రాజీనామా చేయడం మరింత సంచలనంగా మారింది. వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేశానని చెబుతున్నా.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చకే ఆమె పోలిట్ బ్యూరో పదవిని వదులుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. టీడీపీని పునర్ వ్యవస్థీకరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న టైమ్ లో గల్లా అరుణ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

అయితే టీడీపీ నేతలు మాత్రం ఆమె కేవలం పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేసారని, పార్టీకి కాదని సర్ది చెప్పుకుంటున్నారు. అరుణ రాజీనామా వ్యవహారం ఆమె కొడుకు జయదేవ్ కి తెలియకుండా జరిగింది కాదు. అంటే తల్లీకొడుకులిద్దరూ మాట్లాడుకునే ఓ స్థిరమైన నిర్ణయానికొచ్చారన్నమాట.

ఫ్యాన్ గాలికి అందరూ కొట్టుకుపోయినా.. గుంటూరు లాంటి నియోజకవర్గంలో తాను గెలవడం కేవలం తన సొంత ఇమేజ్ తో మాత్రమే సాధ్యమైందనే అభిప్రాయం జయదేవ్ లో ఉంది. అందులోనూ గల్లా ఫ్యామిలీ ఎప్పుడూ పార్టీని కేర్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడిలా ఉరుములేని పిడుగులా రాజీనామా చేసి పార్టీలో కలకలం సృష్టించారు అరుణ.

గల్లా ఫ్యామిలీ కూడా టీడీపీకి దూరమవుతున్న వేళ.. పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు ఇప్పుడు మూడు దారులయ్యారనే విషయం కనిపిస్తూనే ఉంది.

విశాఖకు దసరా కానుక