సమీక్ష: నిశ్శబ్దం
రేటింగ్: 2.5/5
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
తారాగణం: అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మాడ్సన్, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు
కథనం: కోన వెంకట్
సంగీతం: గోపి సుందర్
నేపథ్య సంగీతం: గిరీష్ జి.
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: షానీల్ డియో
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
కథ, దర్శకత్వం: హేమంత్ మధుకర్
విడుదల తేదీ: అక్టోబరు 2, 2020
వేదిక: అమెజాన్ ప్రైమ్
ప్రతిభావంతులైన నటీనటులు తెరపై వున్నా, ఒక కాల్పనిక కథను వాస్తవికంగా చూపించే సర్వ హంగులు సమకూరినా, ఆసక్తిగొలిపే కథావస్తువు కుదిరినా… ఆకట్టుకునేలా దానిని చెప్పలేనపుడు ఇవేమీ అక్కరకు రావనే దానికి తాజా ఉదాహరణ ‘నిశ్శబ్దం’.
‘దెయ్యాల బంగళా’ అని తెలిసీ ఒక జంట ఓ పెయింటింగ్ కోసమని అందులోకి వెళతారు. వెళ్లిన కాసేపటికే అతను చనిపోతాడు. ఆమె తప్పించుకుని బయట పడుతుంది. ఏమి జరిగిందో కళ్లకు కట్టినట్టు చెప్పడానికి ఆమెకు మాటలు రావు. ఆమె ఇచ్చిన నిశ్శబ్ద సమాచారంతోనే పోలీసులు ఏమి జరిగి ఉంటుందో కనుగొనాలి. నిజంగా అతడిని దెయ్యమే చంపిందా? లేక ఆ దెయ్యం కథ వాడుకుని ఎవరైనా ఆ హత్య చేసి ఉంటారా?
కథగా చెప్పుకుంటే ఆసక్తి కలిగించే నిశ్శబ్దంలో అనుష్కను ఆకర్షించడానికి ‘మ్యూట్’ క్యారెక్టరుంది. మాట్లాడకుండా హావభావాలతో భావోద్వేగాలు పండించడమనేది ఏ నటికైనా ఇష్టమైన సవాల్. ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలు చేసిన అనుష్క ఈ పాత్ర పోషించడానికి ఇంతకంటే కారణం లేదనిపించింది. అయితే నాలుగు మాటలలో చెప్పుకుంటే బాగుందనిపించే కథ, అనుష్క అభినయం ఈ ‘నిశ్శబ్దం’తో సవ్వడి చేయించలేకపోయాయి. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్‌కు కావాల్సిన అరెస్టింగ్ స్క్రీన్‌ప్లే ఇందులో మిస్ అయింది.
ఈ కథను చెప్పడానికి ఎంచుకున్న కొన్ని పద్ధతులు… వాయిస్ ఓవర్లో ప్రేక్షకులకు వివరాలు తెలియజేయడం లాంటివి మిస్‌ఫైర్ అయ్యాయి. డీటెయిలింగ్ జోలికి పోకుండా కేవలం ఆడియోపై డిపెండ్ అయినపుడు క్యారెక్టర్స్‌తో కనక్ట్ ఏర్పడడం కష్టం. కనీసం చూపించిన ఆ కొద్ది సన్నివేశాలయినా ఎఫెక్టివ్‌గా వున్నట్టయితే ఆ లోటుని కాస్తయినా అధిగమించే అవకాశముండేది. లీడ్ క్యారెక్టర్ మ్యూట్ కావచ్చు కానీ కథకుడు/దర్శకుడు కమ్యూనికేట్ చేయడానికి ధ్వని కంటే దృశ్యాన్ని ఎంచుకుంటే నిశ్శబ్దానికి జస్టిఫికేషన్ జరిగేది.
పాత్ర చిత్రణ పరంగా కూడా పలు పొరపాట్లు జరగడంతో లీడ్ క్యారెక్టర్‌తో సహా ఏ పాత్ర పట్ల ఎలాంటి ఎమోషనల్ కనక్ట్ ఏర్పడదు. సదరు పాత్రలకు ఎలాంటి అనుభవం ఎదురవుతున్నా ‘సైలెంట్ స్పెక్టేటర్’ అవుతామే తప్ప ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ కాలేం. ఉదాహరణకు అనుష్క స్నేహితురాలు షాలిని పాండేకి ఆమె పట్ల అమితమైన పొసెసివ్‌నెస్ అంటారు. అనుష్క ఎవరికైనా కాస్త దగ్గరయినా తట్టుకోలేదని చెబుతారు. సదరు పొసెసివ్ నేచర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చూపించే సన్నివేశాలు సినిమాటిక్‌గానే కాకుండా కాస్త సిల్లీగా కూడా అనిపిస్తాయి. స్పాయిలర్స్ ఇచ్చేసినట్టు అవుతుంది కనుక డీటెయిల్స్ లోకి వెళ్లడం లేదు కానీ అతి కీలకమైన మరో రెండు పాత్రలు ప్రవర్తించే విధానం, వారు చేసే పనులను సమర్ధించుకోవడానికి చెప్పే కారణం చాలా ఫూలిష్ అనిపిస్తాయి. ఒకటే సీన్లో కొన్నిటిని తేల్చేయాలని చూడడం అన్ని వేళలా కుదరదు. కొన్నిటికి కాస్త సమయం తీసుకుని చూపిస్తే తప్ప ఆ ప్రభావం ఉండదు.
మొత్తం సినిమా అంతా ఆ ఘట్టంపై డిపెండ్ అయినపుడు కనీసం ఆ పాత్రలు పోషించిన నటుల స్థాయికి తగ్గట్టు అయినా బెటర్ రీజనింగ్ ఇచ్చి వుండాల్సింది. ఇక పోలీస్ డిటెక్టివ్‌గా అంజలి (వ్వాట్… అనిపించినా అదే నిజం) క్యారెక్టర్ని హాఫ్ వేలో ఓపెన్ చేయడం వల్ల ఆమె ఎంతటి ప్రమాదకర పరిస్థితులలోకి వెళుతున్నా (వెనక అవసరాల శ్రీనివాస్ రన్నింగ్ కామెంటరీ ఇస్తూనే వుంటాడు… ఆమెని వారించడానికో లేక ఆమెకు ప్రమాదం జరగబోతోందని మనల్ని ఎలాగైనా అలర్ట్ చేసి టెన్షన్ పెట్టడానికో తెలీదు) ఎలాంటి ఉత్కంఠకు గురి చేయదు. పైపెచ్చు డిసిపి రామచంద్రలా తన మనోగతాన్ని, గతాన్ని కూడా ఆమె సవివరంగా విన్నవిస్తోంటే ఒక పోలీస్ కథ చెబుతున్న ఫీల్ మాత్రం ఎక్కడా రాదు. మైఖేల్ మ్యాడ్సన్ విషయానికి వస్తే తన క్యారెక్టర్ తాలూకు మలుపులను మైలు దూరంనుంచి పసిగట్టేంత పకడ్బందీగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు.
కథలో సస్పెన్స్ అనిపించే ఎలిమెంట్స్ చాలా వున్నాయి. అనూహ్యమయిన మలుపులు కూడా కుదిరాయి. కానీ వాటిని చెప్పిన విధానం, తెరకెక్కించిన వైనం ‘నిశ్శబ్దం’ నిరాశ కలిగించడానికి కారణాలయ్యాయి. దృశ్యపరంగా ఈ థ్రిల్లర్‌ను అత్యుత్తమంగా తెరమీదకు తీసుకొచ్చారు. సాంకేతికంగా అన్నీ పకడ్బందీగా వుండేట్టు చూసుకున్నారు. కానీ విజువల్‌గా, టెక్నికల్‌గా వున్న ఆ సూపీరియారిటీ రచనా పరంగా, దర్శకత్వ పరంగా చూపించలేకపోయారు. వేరే జోన్రా సినిమాలకు అయినా ఇతరత్రా హంగులు, హాస్యం వగైరాతో లోపాలు కప్పిపుచ్చుకోవచ్చు. థ్రిల్లర్‌కు వచ్చేసరికి కదలకుండా కూర్చోబెట్టడమే విజయ లక్షణం. అనుక్షణం ఉత్కంఠ రేకెత్తిస్తేనే ఆశించిన ఫలితం.
కళ తప్పిన బొమ్మకు ఇక ఎంత ఖరీదయిన వస్త్రాలేసినా కానీ లోపం కప్పిపుచ్చలేనట్టు రైటింగ్ టేబుల్‌పైనే ట్రాక్ తప్పిన ఈ చిత్రాన్ని తారాగణం లేదా సాంకేతిక బలం మెప్పించేలా మలచలేకపోయాయి. మరోసారి ఓటిటి రిలీజ్‌ని ఎంచుకున్న మరో సినిమా థియేటర్స్ తో వుండే రీచ్ మిస్ అయిపోయిందనే బాధ కంటే ఈ లాక్డౌన్ వల్ల లక్కీగా ఎస్కేప్ అయిపోయిందనే భావన కలిగిస్తుంది.
బాటమ్ లైన్: నిరుత్సాహం!
గణేష్ రావూరి