తిరుప‌తి వెళ్ల‌కుండానే తిరుమ‌ల‌కు…

క‌డ‌ప వైపు నుంచి వ‌చ్చే శ్రీ‌వారి భ‌క్తులు రానున్న రోజుల్లో తిరుప‌తి వెళ్ల‌కుండానే తిరుమ‌ల‌కు చేరుకునే మార్గానికి టీటీడీ పాల‌క మండ‌లి ప‌చ్చ జెండా ఊపింది. దీని వ‌ల్ల 40 కిలోమీట‌ర్ల ప్ర‌యాణ దూరం…

క‌డ‌ప వైపు నుంచి వ‌చ్చే శ్రీ‌వారి భ‌క్తులు రానున్న రోజుల్లో తిరుప‌తి వెళ్ల‌కుండానే తిరుమ‌ల‌కు చేరుకునే మార్గానికి టీటీడీ పాల‌క మండ‌లి ప‌చ్చ జెండా ఊపింది. దీని వ‌ల్ల 40 కిలోమీట‌ర్ల ప్ర‌యాణ దూరం త‌గ్గుతుంది. మ‌రోవైపు తిరుప‌తిలో కూడా ట్రాఫిక్ త‌గ్గుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ ఆకేపాటి అమ‌ర‌నాథ్‌రెడ్డి 18 ఏళ్ల పోరాటానికి ఎట్ట‌కేల‌కు మోక్షం ల‌భించింది.

ఆధ్యాత్మిక విప్ల‌వ‌కారుడు, ప‌ద‌క‌వితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడియాడిన కాలిబాటకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించడమే కాకుండా ఆ మార్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని టీటీడీ బోర్డు చైర్మన్‌ సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోవడంపై భ‌క్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ దారి ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే కడప, కర్నూలు, అనంతపురం, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి , తెలంగాణ‌లోని చాలా ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు తిరుమల చేరుకోవ‌డం చాలా ద‌గ్గ‌ర‌వుతుంది.

అన్నమయ్య మార్గాన్ని సిద్ధం చేస్తే తిరుమలకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. తిరుపతికి వెళ్ల‌కుండానే నేరుగా తిరుమ‌ల చేరుకోవ‌చ్చు. రైల్వేకోడూరు మీదుగా కుక్కలదొడ్డి, మామండూరు వరకు వెళ్లి.. అక్కడి నుంచి శేషాచలం కొండల్లో 18 కి.మీ ప్ర‌యాణిస్తే తిరుమ‌ల శ్రీ‌వారిని చేరుకోవ‌చ్చు.  

ఇది మూడో ఘాట్ రోడ్డు అవుతుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లకంటే ఇది ఎంతో మెరుగైన‌దిగా భావిస్తున్నారు. అన్న‌మ‌య్య‌మార్గం ఏర్పాటుతో తిరుమ‌ల‌కు వెళ్లేందుకు మొత్తం మూడు దారులు ఉన్న‌ట్టు లెక్క‌.  

ఈ కాలిబాటను టీటీడీ పున‌రుద్ధ‌రించి, రోడ్డు మార్గం ఏర్పాటు చేయాల‌నే డిమాండ్‌పై ప్రస్తుత జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి 18 ఏళ్లుగా వేలాది మందితో ఏటా పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 17న మ‌రోసారి ఇదే బాట‌లో ఆయ‌న తిరుమ‌ల‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 

ఆయ‌న పోరాటం ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిల‌కు అమర్‌నాధరెడ్డి చేసిన విన‌తి స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చింది.