ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ఈ దేశాన్ని ఎంత గొప్పగా పాలిస్తున్నదో అప్పుల గణాంకాలు చెబుతున్నాయి. మోడీ ఏడేళ్ల పాలనలో ఏకంగా 117% అప్పులు పెరగడం, దేశ ఆర్థిక పరిస్థితిని ఆందోళనకు గురి చేస్తోంది.
భారీ మొత్తంలో అప్పులు చేసి, దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను దివాళా తీయించడం, వాటిని ప్రైవేట్‌పరం చేయించడం మోడీ మార్క్ ప్రగతికి నిదర్శనంగా చెప్పొచ్చు.
మోడీ అప్పుల్ని ప్రజలకు చెప్పడానికి కూడా మన ఘనత వహించిన మీడియాకు ధైర్యం చాలడం లేకపోవడం గమనార్హం. సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానమే… మోడీ సర్కార్ మేడిపండు పాలనను బట్టబయలు చేసింది.
1950-51లో దేశం నికర అప్పు రూ.2,565.40 కోట్లు. 2021-22 వచ్చే నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. 2014 నుంచి మన దేశాన్ని మోడీ సర్కార్ పాలిస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చే సమయానికి అంటే 2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62,42,220.92 కోట్లు. ప్రస్తుతానికి వస్తే 2021-22 బడ్జెట్ నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. అంటే మోడీ ఏడేళ్ల పాలనలో మన దేశం అప్పు 117% పెరిగింది. ఒకట్రెండు దఫాలు వేరే వాళ్లు మినహాయించి, కాంగ్రెస్ ఏలుబడిలోని 64 ఏళ్లలో దేశం రుణం రూ.62.42 లక్షల కోట్లు.
గత ఏడేళ్లలోనే కొత్తగా రూ.73,44,754 కోట్ల అప్పు చేసినట్టు స్వయాన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కలు చాలు… దేశభక్తి పార్టీ మనల్ని ఎంత గొప్పగా పాలిస్తున్నదో అర్థం చేసుకోడానికి. తమ పాలనలో దేశం వెలిగిపోతోంది …వెలిగిపోతోంది అని బీజేపీ అంటుంటే, నిజమోకాబోలు అని అందరూ అనుకున్నారు. కానీ తాజా గణాంకాలు మన దేశంలో అప్పుల్లో వెలిగిపోతోందనే వాస్తవాల్ని తేల్చి చెప్పాయి. భగవంతుడా ఈ దేశానికి దిక్కేది?