దేనికీ అనుమతి అడగం.. మేం చెప్పినట్టుగా చేశారా సరే సరి, లేకపోతే మేం చేయాల్సింది చేస్తాం.. కోర్టుకు వెళ్తాం! ఇదీ అమరావతి ఉద్యమం తీరు!
ఈ తీరును చూస్తుంటే.. అమరావతి అంటేనే ఇంత అరాచకమా అనిపించకమానదు. తాము రైతులమని చెప్పుకుంటున్న వాళ్లు, న్యాయంగా పోరాడుతున్నట్టుగా చెప్పుకునే వాళ్లు.. వ్యవహరించే తీరు ఇదేనా? వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అనేవి ప్రశ్నలు.
పాదయాత్రకు అంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా పలు పరిమితులను పెట్టి పర్మిషన్ ఇచ్చింది. మరి నాడు సభ నిర్వహించాలనే ఐడియా లేదా? లేక ఒకేసారి సభకు పర్మిషన్ కోరితే.. పాదయాత్రకు మాత్రమే పర్మిషన్ వస్తుందనుకున్నారా?
ఏ ప్రాంతానికి అయినా ఒక స్వాభిమానం అంటూ ఒకటి ఉంటుంది. మరి ఆ స్వాభిమానం రాయలసీమకు ఉండకూడదా? తెలంగాణ ఉద్యమం సాగుతున్న రోజుల్లో.. జై బోలో తెలంగాణ అంటూ ఒక సినిమాను తీసి జనం మీదకు వదిలారు. దాన్ని సీమాంధ్ర ప్రాంతంలో ఆడనిచ్చారా?
ఆ సినిమా ప్రదర్శనను విజయవాడలో చేశారా? అప్పుడు సీమాంధ్ర వ్యాప్తంగా ఆ సినిమాను విడుదల చేయనివ్వలేదు కదా! మరి ఇప్పుడు జై అమరావతి అంటూ సీమలో ఎలా సభ పెట్టాలనుకుంటున్నారు? ఇదంతా వైష్యమాలను పెంచే ప్రయత్నం కాక మరోటా?
అమరావతి ఉద్యమం అంటే.. అరాచకమైన రీతిలో అర్థం లేని రీతిలో, అశాంతిని రేకెత్తించే రీతిలో చేయడమా? దేవుడితో మొరపెట్టుకోవడానికి అంటూ వచ్చి.. సీమలో అహంకార ప్రదర్శన చేయాలని చూస్తూ విద్వేషాలను, అశాంతిని రేకెత్తించడమే అమరావతి ఉద్యమ అంతిమ లక్ష్యం లాగుంది.