పుత్రరత్నం సమర్థత మాటేంటి చంద్రబాబూ?

చంద్రబాబు నాయుడు గారు.. కత్తికి పదును పెడుతున్నారు. ఒక్కొక్క వేటూ పడుతోంది. పార్టీ అత్యంత దారుణంగా ఓటమి పాలైన నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన నాయకులతో కూడా ఆయన ఒక తాజా సమావేశం…

చంద్రబాబు నాయుడు గారు.. కత్తికి పదును పెడుతున్నారు. ఒక్కొక్క వేటూ పడుతోంది. పార్టీ అత్యంత దారుణంగా ఓటమి పాలైన నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన నాయకులతో కూడా ఆయన ఒక తాజా సమావేశం నిర్వహించారు. కొత్త రక్తం ఎక్కిస్తానని, సమర్థులకు పెద్ద పీట వేస్తానని, కోవర్టులను సహించేది లేదని, ఎంతటి వారైనా ఉపేక్షించబోనని.. యాజిటీజ్ పాత రికార్డును మళ్లీ వినిపించారు. 

కుప్పం లో ఓడిపోయిన పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా ఏ పడికట్టు డైలాగులతో బీరాలు పలికాడో.. అదే తరహాలో చంద్రబాబునాయుడు మరోసారి హూంకరించారు. నెల్లూరులో ఇద్దరు నాయకులపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. 

అయితే చంద్రబాబునాయుడుకు నిజంగానే పార్టీని ఉద్ధరించే ఉందా? లేదా, ఈ సస్పెన్షన్లు.. ‘లేస్తే మనిషిని కాదు తెలుసా?’ అని బెదిరించినట్లుగా కోవర్టులను సహించను అనే నాటకీయమైన డైలాగులు.. సమస్తం తాటాకు చప్పుళ్లు మాత్రమేనా? అనే అనుమానం పార్టీ వారికి కలుగుతోంది. 

నెల్లూరులో చంద్రబాబునాయుడు ఇద్దరిని కోవర్టులుగా భావించి సస్పెండ్ చేశారు బాగానే ఉంది. కానీ.. అంతకంటె ఘోరమైన పరాజయానికి, పరాభవానికి కారణమైన కుప్పం నియోజకవర్గంలో ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరిని సస్పెండ్ చేశారు? ఎవరి మీద కత్తిదూశారు? 

ఇప్పటిదాకా కనీసం అక్కడి కోవర్టులను గుర్తించనేలేదంటే.. చంద్రబాబు సమర్థత అంతేనా? సాధారణంగా ఎక్కడైనా ఇంటగెలిచి రచ్చగెలవాలంటారు? చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోలేకుండా.. నెల్లూరుమీద ముందు కత్తి దూయడం అనేది పార్టీకి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? అనే తరహా ప్రశ్నలు ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో కలుగుతున్నాయి. 

కోవర్టుల మీద కత్తిదూయడం మంచిదే. పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని ఏరిపారేయడం మంచిదే.. అదే సమయంలో, పార్టీని బలోపేతం చేయడానికి సమర్థుల్ని ఎంపికచేయడమూ ముఖ్యం. అసమర్థుల్ని పక్కన పెట్టడమూ అంతే ముఖ్యం.

పార్టీలో ఇప్పటిదాకా అత్యంత అసమర్థుడిగా పేరుతెచ్చుకున్న నారా లోకేష్.. సర్వసైన్యాధ్యక్షుడిలాగా కీలకంగా సారథి స్థానంలో ఉంటే.. ఇక ఆయన కింద పనిచేయడానికి పార్టీలోని సమర్థులు నిజంగానే ఉత్సాహంగా ముందుకు వస్తారా? అనేది ప్రశ్న.

సమర్థులను ప్రోత్సహిస్తే.. వారు లోకేష్ ను దాటి పైకి ఎదుగుతారేమో అనే భయం కూడా చంద్రబాబులో ఉన్నదనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. అందుకే.. చంద్రబాబునాయుడు సమర్థత గురించి ఎన్ని మాటలు వల్లించినా.. లోకేష్ కంటె అసమర్థుల్ని మాత్రమే ఆదరిస్తారని, ఏతావతా పార్టీకి జరగాల్సిన నష్టం పూర్తిగా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

సమర్థులు, కొత్తరక్తం లాంటి పడికట్టు పదాలు పలికేముందు.. చంద్రబాబునాయుడు తన ఇంటి బంగారం సరుకెంతో తెలుసుకోవాలని పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.