టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ప్రత్యేక హోదా రూపంలో ఓ మహత్తర అవకాశం లభించింది. దాన్ని ఎలా మలుచుకోవా లనేది తన చేతుల్లోనే ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతోందని చంద్రబాబు చాలా కలత చెందుతున్నట్టు కనిపిస్తోంది.
అయితే అది మాటల వరకే పరిమితం కాకుండా చేతల వరకూ వస్తే… అది ఆయనకే రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందనే చర్చ నడుస్తోంది. నిజంగా ప్రత్యేక హోదాపై చంద్రబాబులో చిత్తశుద్ధి వుంటే, దాని కోసం తానెందుకు పోరాటం చేయకూడదనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
తన ప్రధాన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు విసిరిన సవాల్ ఏంటో చూద్దాం.
“ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి వుంటే ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయించాలి. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారు. అంతా కలసి పోరాడదాం. ప్రత్యేక హోదా సాధిద్దాం. ఈ సవాల్‌కు సిద్ధమా?” అని చంద్రబాబు తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించలేదని జగన్‌ను విమర్శిస్తూనే, మరోవైపు రాజీనామాలకు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది.
2019కి ముందు ప్రత్యేక హోదా కోసం జగన్ ఉద్యమించిన విధంగా, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రత్యేక హోదా కోసం తన ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించి… ఇటు సీఎం జగన్, అటు పీఎం మోడీపై ఒత్తిడి పెంచి ప్రజల్లో టీడీపీపై సానుకూల వాతావరణాన్ని సృష్టించుకునే గొప్ప అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకుంటున్నారు? ఎటూ జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు నమ్ముతున్న నేపథ్యంలో తన ఎంపీల గెలుపునకు ఢోకా వుండదు.
వైసీపీ ఎంపీల రాజీనామాలతో సంబంధం ఏంటి? గతంలో జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయించి నాటి పాలక పక్షమైన తనపై ఒత్తిడి పెంచడాన్నిచంద్రబాబు మరిచిపోతే ఎలా? జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నిరూపించడానికి ప్రత్యేక హోదాపై తన ఎంపీలతో రాజీనామా చేయించడం ఒక్కటే ఉత్తమ మార్గం.
ఈ మహత్తర విషయం నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబుకు మరెవరో చెప్పాలా? ఆలస్యం అమృతం విషం అని పెద్దలు అన్నారు. కేసీఆర్, జగన్ మాదిరిగా తన ఎంపీలతో రాజీనామా చేయించి, వాళ్ల సరసన చంద్రబాబు చేరాలి. సవాల్ అంటే మీరు రాజీనామా చేయండి, మేమూ చేస్తామని చెప్పడం కాదు. తాము రాజీనామా చేస్తున్నామని, దమ్ముంటే ఎదుర్కొనేందుకు రావాలని ప్రత్యర్థులపై కాలు దువ్వడం.
కావున ఇకపై ఆలస్యం చేయకుండా జగన్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు, అలాగే తన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించి కదనరంగంలో దూకాల్సిన సమయం ఆసన్నమైంది. పదండి బాబు ముందుకు…పోదాం పోదాం ఉప ఎన్నికలకు!