ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ నుంచి ఓ సర్ ప్రైజ్ రాబోతోంది. రిలీజ్ కు ముందు రోజే ఈ సినిమా చూసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు దర్శకుడు రాజమౌళి ప్రకటన చేశాడు. మీడియాతో మాట్లాడిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాను ముందు రోజే ప్రత్యేకంగా ప్రదర్శించే విషయంపై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి ఓ ప్రకటన చేస్తానని హామీ ఇచ్చాడు.
నైజాం వరకు ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రత్యేక అనుమతితో ఉదయం 7 గంటల నుంచే షోలు వేసుకోవచ్చు. మిడ్ నైట్ షోలు, మార్నింగ్ 5 గంటల షోలు కూడా పడే ఛాన్స్ ఉంది. కానీ ఏపీలో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ టిక్కెట్ రేట్లు పెంచుకోవడం, అదనపు షోలు వేసుకోవడం కుదరని పని. దీంతో ఆర్ఆర్ఆర్ నిర్మాతలు మరో కొత్త ఆలోచన చేస్తున్నారు.
జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతోంది. అంతకంటే కొన్ని గంటల ముందు, అంటే 6వ తేదీన ఏపీలో సెకెండ్ షోలు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది యూనిట్. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్టు అవ్వదు. పైగా ఏపీలో బెనిఫిట్ షో వేసినట్టు కూడా అవుతుంది.
అయితే ఇదింకా చర్చల దశలోనే ఉంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుంది యూనిట్. మరోవైపు అదనపు ఆటలకు సంబంధించి ఏపీ ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్నామని నిర్మాత దానయ్య ఆల్రెడీ ప్రకటించారు.
సో.. ప్రభుత్వం అంగీకరిస్తే, బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో ఆర్ఆర్ఆర్ మొదలవుతుంది. చర్చలు సక్సెస్ అవ్వకపోతే మాత్రం ముందు రోజు సెకెండ్ షోలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.