హిందూ వివాహ చట్టం, ముస్లిం లా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్.. ఇవన్నీ ఆయా మతాలకు సంబంధించి భారతదేశం గుర్తించిన వివాహ చట్టాలు. మరి వేర్వేరు మతాల వారు వివాహం చేసుకోవాలంటే ఎలా..? వారి వివాహాన్ని దేనికింద పరిగణిస్తారు..? అసలా వివాహాలు చెల్లుబాటవుతాయా, లేదా..? వీటన్నిటికీ సమాధానమే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. 1954 నుంచి అమలులో ఉన్న ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇటీవల స్వర భాస్కర్ వివాహంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది.
సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్న స్వర భాస్కర్, తమ పెళ్లి వార్తను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. త్రీ ఛీర్స్ ఫర్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటూ కామెంట్ చేశారు. ప్రేమించడానికి, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోడానికి మనకున్న మరో మంచి అవకాశం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటూ ట్వీట్ చేశారామె. ఆ తర్వాతే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ గురించి చర్చ మళ్లీ మొదలైంది.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్.. ఏం చెబుతుందంటే..?
– 1954లో పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది.
– రెండు వేర్వేరు మతాల వారు మతం మారకుండానే పెళ్లి చేసుకోడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
– దేశంలో నివసించే ప్రతి వ్యక్తీ ఈ చట్టం ప్రకారం తమకు నచ్చినవారిని వివాహం చేసుకోవచ్చు.
– అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
– రిజిస్ట్రేషన్ ఆఫీసులో 30 రోజుల ముందే అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
– దీని ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీస్ బోర్డ్ లో ప్రకటన ఉంచుతుంది.
– నోటీసు జారీ అయిన 30 రోజుల్లో ఏదైనా అభ్యంతరాలు వస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసు సిబ్బంది దర్యాప్తు చేస్తారు.
– అభ్యంతరాలు సరైనవని తేలితే, వివాహానికి అనుమతి ఇవ్వరు.
– అభ్యంతరాలు లేకపోతే వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారు. సర్టిఫికేట్ కూడా ఇస్తారు.
ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే ముస్లిం అయిన ఫహద్ అహ్మద్ ని హిందువు అయిన స్వర భాస్కర్ వివాహం చేసుకుంది. ఇలాంటి వ్యవహారాలకు లవ్ జీహాదీ అని ముద్రవేసే మేధావులు కూడా ఉన్నారు. వారందరికీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సమాధానం చెబుతుందనేది స్వర భాస్కర్ వాదన. అందుకే ఆమె ప్రత్యేకంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ని మెన్షన్ చేసింది. ప్రేమ పక్షులందరికీ ఆ చట్టంపై అవగాహన ఉండాలని పరోక్షంగా హింట్ ఇచ్చింది.