తిరుపతి, తిరుమల గుర్తుకొస్తే… గోవింద నామస్మరణ మన మనసుల్లో మార్మోగుతుంది. కలియుగ దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల ఆలయమే కాదు ….ఆయన పాదస్పర్శకు నోచుకున్న ఏడుకొండలు కూడా అంతే పవిత్రమైనవి. అంతేనా, తిరుమల శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతి పవిత్రత అంతాఇంతా కాదు. అలాంటి మహిమాన్వితమైన తిరుపతికి పుట్టిన రోజు ఒకటంటూ వుంది.
ఈ పవిత్ర పుణ్యక్షేత్రం గొప్పతనాన్ని పది మందికి తెలియజేయాలనే భక్తిభావంతో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముందుకొచ్చారు. టీటీడీ చైర్మన్గా భూమన విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన తిరుపతి పుట్టిన రోజు వేడుకను వరుసగా రెండోసారి జరపడానికి సంకల్పించారు. ఈ సందర్భంగా తిరుపతి విశిష్టత, పుట్టిన రోజు ఆవశ్యకతను వివరించడానికి ఇవాళ తిరుపతిలో భూమన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..
ప్రపంచంలో భూమ్మీద మనుషులకు పుట్టిన రోజులుండడం తెలుసన్నారు. కానీ ఒక్క వేంకటేశ్వరుని నిలయమైన మన తిరుపతికి మాత్రమే పుట్టిన రోజు సొంతమని చెప్పుకొచ్చారు. ఎన్నోమహానగరాలు వచ్చాయి, కాలగర్భంలో కలిసి పోయాయన్నారు. ఈ సందర్భంగా మెసొపొటోమియా సంస్కృతిలో వచ్చిన నగరాలు, మన హరప్పా మొహంజో దారో మొదలుకుని లండన్ మహానగరాల వరకూ ఆయన ప్రస్తావించారు. వీటిలో కొన్ని నగరాలు కాలగర్భంలో కలిసిపోగా, మరికొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయన్నారు. కానీ వీటికేవీ పుట్టిన రోజులు లేవన్నారు. ఆ ప్రాశస్త్యం మన తిరుపతి సొంతమన్నారు.
1130, ఫిబ్రవరి 24న జగద్గురువైన రామానుజాచార్యుల అమృత హస్తాల మీదుగా తిరుపతికి శంకుస్థాపన జరిగిందన్నారు. రామానుజాచార్యులు ఆనాడున్న తిరుమల పరిస్థితిని సరిదిద్దడానికి , ఆలయంలో ఉన్న వైఖానస సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, వాటిని స్థిరీకరించారన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని ఆలయానికి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి రామానుజాచార్యులు అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. దాదాపు 120 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజా చార్యులు మూడుసార్లు తిరుపతి, తిరుమలకు వచ్చారని ఆధారాలు చెబుతున్నాయన్నారు.
రామానుజాచార్యులు సమతాభావనకు అంకురార్పణ చేసింది కూడా తిరుమల ఆలయమే అన్నారు. అలాగే ఆలయానికి అర్చకులు దగ్గరగా ఉండాలని, చిదంబరం నుంచి తీసుకొచ్చిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని ఎక్కడైనా ప్రతిష్టిస్తే బాగుంటుందనే సదాశయం… ఈ రెండు కలిసి 1130వ సంవత్సరంలో 112 ఏళ్ల వయసులో రామానుజాచార్యులు …అనుకున్నట్టే విగ్రహాన్ని ప్రతిష్టించి నాలుగుమాఢ వీధులకు శంకుస్థాపన చేశారన్నారు. ఇది తిరుమల ఆలయానికి బ్రాహ్మణ అగ్రహారం అని నాడు ఆయన వేసిన శంకుస్థాపనే, ఆ తర్వాత కాలంలో గోవిందరాజపురంగా, కాలక్రమంలో రామానుజపురంగా, 1220-40 మధ్య కాలం నుంచి ఇది తిరుపతిగా పిలవబడుతోందన్నారు.
తిరుపతి పుట్టిన రోజు 1130, ఫిబ్రవరి 24 అని ఎలా చెప్పగలమంటే… గోవిందరాజస్వామి గుడిలో నిత్యపూజా కైంకర్యంలో, మంత్ర పుష్పంలో ప్రతిదినం పలికే మంత్రంలో స్పష్టంగా ఉందంటూ ఆయన ఈ సందర్భంగా చదివి వినిపించారు. ఈ మంత్రం వేంకటేశ్వరస్వామి ఆలయంలో, గోపురం నిర్మించడానికి పూర్వమే చెక్కబడ్డ శాసనాల్లో తొలిశాసనంగా వుందన్నారు. ఇంత పరమాద్భుతమై, మహిమాన్వితమైన, పరమ పవిత్రమైన, పూజ్యమైన తిరుపతిలో మనమందరం ఉండడం జన్మజన్మల సుకృతం తప్ప మరొకటి కాదన్నారు. సాక్ష్యాత్తు శ్రీపతి నగరం లక్ష్మీశ్రీనివాసుల, లక్ష్మీసరస్వతుల నిలయం కూడా మన తిరుపతి అని ఆయన అన్నారు.
ఈ విషయాన్ని తాము వెలికి తీయలేదన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరునగరికి పుట్టిన రోజు వుందని తెలిసిన తర్వాత ఆ వైభవాన్ని జరపుకోకపోతే పాపపంకిలం అవుతుందని భావించి గత ఏడాది 892వ పుట్టిన రోజు జరిపామని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న 893వ పుట్టిన రోజు జరుపుకుందామని ఆయన తిరుపతి ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పండుగగా భావించి జరుపుకోవాలని ఆయన సూచించారు. 24న ఉదయం 8 గంటలకు గోవిందరాజస్వామి గుడి వద్ద వేడుకకు శ్రీకారం చుట్టనున్నట్టు ఆయన చెప్పారు.
ఇదిలా వుండగా మీడియా సమావేశం అనంతరం….. రామానుజాచార్యులు తిరుమల ఆచార వ్యవహారాలను పర్యవేక్షించడానికి తాను నియమించిన శతకోప యతి వ్యవస్థలో ఉన్న పెద్దజీయర్, చిన్నజీయర్ స్వామీజీలకు మొట్టమొదటగా తిరుపతి పుట్టిన రోజు ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే తిరుపతి పురవీధుల్లో తిరుగుతూ నగరవాసులను ఆహ్వానించడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, సాహితీవేత్తలు సాకం నాగరాజ, శైలకుమార్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.