సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై అనేక ఊహాగానాలున్నాయి. రానున్న ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. అయితే ఏ రాజకీయ పార్టీ అనేది మాత్రం ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తన ఆలోచనలు, ఆశయాలు ఏంటో ఇప్పటికే స్పష్టం చేశానని చెప్పుకొచ్చారు. తన ఆలోచన విధానం నచ్చి ఏదైనా పార్టీ తన వద్దకు వచ్చి చర్చిస్తే అప్పుడు ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఏ పార్టీ లేకపోయినా మన ఎన్నికల వ్యవస్థలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు.
వ్యవసాయశాఖ మంత్రి కావాలనేది జేడీ లక్ష్మీనారాయణ ఆశయం. వ్యవసాయ ఆధారిత దేశానికి ఎంతోకొంత సేవ చేయాలని ఆయన తపిస్తున్నారు. గతంలో పవన్‌కల్యాణ్‌పై నమ్మకంతో జనసేనలో చేరారు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. పవన్ కల్యాణ్ ముందు చెప్పినట్టు కాకుండా, సినిమా షూటింగ్‌లకు ఎక్కువ సమయం కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు.
దీంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, సొంత మార్గంలో వెళుతున్నారు. సేంద్రీయ సాగు, అలాగే లాభదాయక పంటలపై ఆయన దృష్టి సారించారు. రాజకీయంగా తనవైన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా? లేక ఏదైనా పార్టీ తరపునా? అనేది తేలాల్సి వుంది.