ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ ప్రకటించారు. దీంతో గత కొంత కాలంగా కన్నా రాజకీయ నాటకానికి తెరపడింది. టీడీపీలో చేరకనే, చంద్రబాబు పల్లకీని కన్నా మోయడం గమనార్హం. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం కన్నా తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించడం విశేషం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు.
సీఎం జగన్ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే రాక్షస పాలన మొదలైందన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్‌లో లేదన్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి వుందన్నారు. పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారిన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు. అరాచకం కళ్ల ముందు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.
పైగా బాధితులపైనే కేసులు పెడుతున్నారన్నారు. కక్షలు, కార్పణ్యాలు పెరగడానికి ఏపీలో పోలీస్ వ్యవస్థ కారణమవుతోందన్నారు. జగన్‌కు అధికారం శాశ్వతం కాదన్నారు. ఆ విషయాన్ని పోలీస్ వ్యవస్థ గుర్తించుకోవాలన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదన్నారు.
ఆయనకు ఏమైనా జరిగితే వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. టీడీపీ చేరడానికి రెండు రోజుల ముందే ఆయన చంద్రబాబు మెచ్చుకోలు కోసం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఇక టీడీపీలో చేరితే ఇంకెంతగా బాబు భజన చేస్తారో అనే సెటైర్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.