టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “ఉచిత పబ్లిసిటీ ఎలా పొందాలనే అంశంపై మా పట్టాభి దగ్గర శిక్షణ తీసుకోవాలి” అని టీడీపీ నేతలు మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారు.
ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని నాయకుడు పట్టాభి అని సొంత పార్టీ నేతల అభిప్రాయం. పట్టాభికి మీడియాతో తప్ప, మరెవరితోనూ స్నేహసంబంధాలు లేవని ఆ పార్టీ నేతలే అంటున్న మాట. తాజాగా పట్టాభి కనిపించడం లేదంటూ ఆయన భార్యతో నాటకానికి తెరలేపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గన్నవరం ఎపిసోడ్ నేపథ్యంలో పట్టాభి కనిపించడం లేదంటూ చంద్రబాబు డ్రామాకు క్లాప్ కొట్టడం, మిగిలిన నాయకులు అందుకుని రక్తి కట్టిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పట్టాభి భార్య చందన మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందడం అందరికీ బాధ కలిగిస్తోందని, అయితే భర్త నోటిని అదుపులో పెట్టుకోవాలని ఎప్పుడైనా చెప్పి వుంటే బాగుండేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీలో ఎదిగేందుకు పట్టాభి ప్రత్యర్థులపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, వాటికి వంత పాడుతున్నట్టుగా ఆయన భార్య చందన మాటలు ఉన్నాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ‘నా భర్త పట్టాభిని ఎవరు తీసుకెళ్లారో తెలియదు. అరగంటలో నా భర్త ఎక్కడున్నాడో నాకు తెలియాలి. లేనిపక్షంలో డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా. నా కూతురు రాత్రి నుంచి నాన్న ఇంటికి రాలేదని భయపడుతోంది’ అని ఆమె మీడియాతో మాట్లాడుతూ వాపోయారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై తన భర్త నోరు పారేసుకోవడాన్ని చందన ఎప్పుడైనా వారించారా? అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా, ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. పట్టాభి జీవిత భాగస్వామి మీడియా ముందుకొచ్చి డీజీపీని, ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ముందు, తన భర్తకు హితవు చెప్పి వుంటే అందరి మన్ననలు పొందేవాళ్లనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సీఎం జగన్పై పట్టాభి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కనిపించకపోవడం, ఆయన భార్య చందన గగ్గోలు పెట్టడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇటు పట్టాభి కావచ్చు, అటు అధికార పార్టీకి చెందిన నేతలు కావచ్చు… ఇలా నోటికొచ్చినట్టు దూషణలకు దిగడం వల్ల చివరికి భార్య, పిల్లల్ని బాధ పెడుతున్నామనే చేదు నిజాన్ని గ్రహించాలని పౌర సమాజం హితవు చెబుతోంది. రాజకీయాల్లో సంస్కారవంతంగా ప్రవర్తించడం ఎంత అవసరమో గన్నవరం ఎపిసోడే నిలువెత్తు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.