సీమ రొమ్ము గుద్దుతున్న తెలుగుదేశం నేత‌లు!

శ్రీబాగ్ ఒడంబ‌డిక అనేది ఒక‌టి ఉంద‌ని రాయ‌ల‌సీమ తెలుగుదేశం నేత‌ల‌కు తెలుసా తెలియ‌దా?  రాయ‌ల‌సీమ వెనుకాబ‌డుత‌నం గురించి వాళ్ల‌కు ఉన్న అవ‌గాహ‌న ఎంత‌? అమ‌రావ‌తిలో వీళ్లు కూడా భూములు క‌లిగి ఉన్నారు కాబ‌ట్టి… అంతా…

శ్రీబాగ్ ఒడంబ‌డిక అనేది ఒక‌టి ఉంద‌ని రాయ‌ల‌సీమ తెలుగుదేశం నేత‌ల‌కు తెలుసా తెలియ‌దా?  రాయ‌ల‌సీమ వెనుకాబ‌డుత‌నం గురించి వాళ్ల‌కు ఉన్న అవ‌గాహ‌న ఎంత‌? అమ‌రావ‌తిలో వీళ్లు కూడా భూములు క‌లిగి ఉన్నారు కాబ‌ట్టి… అంతా అమ‌రావ‌తిలోనే ఉండాలా! అమ‌రావ‌తికే త‌మ మ‌ద్ద‌తు అని ఇప్ప‌టికే పలువురు తెలుగుదేశం పార్టీ నేత‌లు నిర్భ‌య‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు. 

ప‌రిటాల సునీత‌, భూమా అఖిల‌ప్రియ వంటి వారితో పాటు.. తెలుగుదేశం కండువాలు వేసుకున్న వారంద‌రి మ‌ద్ద‌తూ అమ‌రావ‌తికే త‌ప్ప‌, శ్రీబాగ్ ఒడంబ‌డిక‌కో, రాయల‌సీమ‌కు న్యాయం ద‌క్కాల్సిన వాటికో కాద‌ని స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌తి తెలుగుదేశం నాయ‌కుడూ అమ‌రావ‌తి బానిసే త‌ప్ప‌.. వాడు రాయ‌ల‌సీమ వాడైనా ఉత్త‌రాంధ్ర‌వాడైనా వారి ప్రాంత అవ‌స‌రాలు ఏమీ వారికి అవ‌స‌రం లేని అంశాలే.

ఈ జాబితాలోని కొత్త బిచ్చ‌గాడు బొజ్జ‌ల సుధీర్ రెడ్డి. అమ‌రావ‌తి ఉద్య‌మం శ్రీకాళ హ‌స్తిలో విజ‌య‌వంతం అయ్యింద‌ని చెప్పుకోవ‌డం వెనుక సుధీర్ రెడ్డి రాజ‌కీయ‌మే త‌ప్ప అంత‌కు మించిన సీన్ లేదు. తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ పూర్తిగా అమ‌రావ‌తికి జై కొడుతోంది. రాయ‌ల‌సీమ టీడీపీ నేత‌లు చంద్ర‌బాబు బానిస‌లే త‌ప్ప‌.. త‌మ‌కు రాజ‌కీయ జ‌న్మ‌ను ఇచ్చిన గ‌డ్డ‌పై కించిత్ మ‌మ‌కారం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.

రాయ‌ల‌సీమ రొమ్ము గుద్దుతున్న నేత‌లుగా టీడీపీ నేత‌ల‌ను ప్ర‌స్తావించ‌వ‌చ్చు. స్వ‌యంగా చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ వాడే పేరుకు! అయితే రాయ‌ల‌సీమ‌కు తెలుగుదేశం హ‌యాంలో ప్ర‌త్యేకించి చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. తొమ్మిదేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు హంద్రీనీవా ప్రాజెక్టును అట‌కెక్కించిన వైనంతో పోలిస్తే.. రాయ‌ల‌సీమ విష‌యంలో ఏనాడూ చంద్ర‌బాబు క‌నీస శ్ర‌ద్ధ కానీ, కాస్త మ‌మ‌కారం కానీ చూపించిన దాఖ‌లాలు లేవు.

ఎక్క‌డో కృష్ణా జిల్లా వాడైన ఎన్టీఆర్ హంద్రీనీవా ప‌థ‌కానికి ప్లాన్ గీయిస్తే, దానికి మార్పు చేర్పుల‌తో అమ‌ల్లో పెట్టింది వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి. చివ‌ర్లో గేట్లు బిగించి హంద్రీనీవాను త‌న ఘ‌న‌త‌గా చెప్పుకున్నాడు చంద్ర‌బాబు. ఈయ‌న పాల‌న‌కు ప్ర‌తిఫ‌లం గ‌త ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఇచ్చిన మూడు అసెంబ్లీ సీట్లు!

రాయ‌ల‌సీమ‌లో తెలుగుదేశం పార్టీ రాజ‌కీయం నానాటికీ మ‌రింత ప‌త‌నావ‌స్థ‌కే జారుతూ ఉంది. ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఉనికి చాటిన మున్సిపాలిటీ ఒక్క‌టంటే ఒక్క‌టే! అది కూడా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సొంత కండ‌తో సాధించిన విజ‌యం. ఇక అమ‌రావ‌తికి జై కొడుతున్న ప‌రిటాల సునీత రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఎక్క‌డ ఎంపీటీసీల‌నో, జ‌డ్పీటీసీల‌నో గెలిపించుకోలేక‌పోయింది. 

భూమా, ప‌య్యావుల‌, బొజ్జ‌ల‌.. ఇలాంటి వారు పొలిటిక‌ల్ క‌మేడియ‌న్లుగా మిగిలిపోతున్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం ఎంపీటీసీని గెలిపించుకోలేక‌పోతున్న వీళ్లు… అమ‌రావ‌తిని ఉద్ధ‌రించే వాళ్ల‌య్యారు!

త‌మ ప్రాంతానికి అన్యాయం జ‌రిగినా ఫ‌ర్వాలేదు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రియ‌లెస్టేట్ పెట్టుబ‌డుల‌కు లోటు రాకూడ‌ద‌నే త‌త్వ‌మే సీమ తెలుగుదేశం నేత‌ల్లో క‌నిపిస్తూ ఉంది. మ‌రి అంతా క‌లిసి అమ‌రావ‌తిలోనే పోటీ చేయాలి కాబోలు.

అయితే అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు నాయుడే ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే ఒక అల్టిమేటమ్ ఇచ్చి ఉన్నారు. గుంటూరు, విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ఎన్నిక‌ల ప్ర‌చారాల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేశారు. గుంటూరులో కానీ, విజ‌య‌వాడ‌లో కానీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించుకోవ‌డానికి అనుమ‌తిని ఇచ్చేసిన‌ట్టే అన్న‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో చెప్పుకున్నారు. 

అందుకు త‌గ్గ‌ట్టుగా అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ‌య‌కేత‌నం ఎగ‌రేసింది. విజ‌య‌వాడ‌, గుంటూరు రెండు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంప‌ర్ మెజారిటీల‌తో నెగ్గింది. త‌ద్వారా అమ‌రావ‌తి త‌మకు ప‌ట్టే అంశం కాద‌ని.. అక్క‌డి ప్ర‌జ‌లే తేల్చిచెప్పారు!

అలాంటిది రాయ‌ల‌సీమ టీడీపీ నేత‌లు మాత్రం..త‌మ క్యాడ‌ర్ తో అమ‌రావ‌తి ఉద్య‌మానికి మ‌ద్ద‌తు అంటూ కామెడీలు చేస్తూ ఉన్నారు. విజ‌య‌వాడ‌లోనూ, గుంటూరులోనూ ప‌ట్ట‌ని అమ‌రావ‌తి ఉద్య‌మానికి శ్రీకాళ హ‌స్తిలో మ‌ద్ద‌తు ల‌భించింద‌ట‌! ఇంకేం.. మ‌రి ఇంత‌క‌న్నా ఏం కావాలి.. అమ‌రావ‌తి రైతులు ఇక సొంతూళ్ల‌కు వెళ్లి హ్యాపీగా ఉండొచ్చు! అమ‌రావ‌తిని రాయ‌ల‌సీమ టీడీపీ నేత‌లే కాపాడేస్తారు!