నమ్మిన వాళ్లను నట్టేట ముంచడంలో చంద్రబాబుకు దిట్ట అనే పేరు వుంది. వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అనే ముద్దు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరైనా నమ్మినోళ్లను కాకుండా, ఇతరులను ఎలా మోసగిస్తారు? ఈ థీరీ ఆధారంగానే చంద్రబాబు రాజకీయం ముందుకు సాగుతుంటుంది. చంద్రబాబు గురించి తెలియక ఎవరైనా మోసపోయారంటే… అయ్యో పాపం అని సానుభూతి చూపొచ్చు.
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు బాబు ఎలా వెన్నుపోటు పొడిచారో తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆయనపై నమ్మకాన్ని పెట్టుకుని వెళుతున్న వాళ్లను ఏమనుకోవాలి? సొంత పార్టీ వాళ్లు ఆయన చేతిలో మోసపోయారంటే అర్థం చేసుకోవచ్చు. తనకంటూ ఒక పార్టీ, ఎజెండా, జెండా ఏర్పాటు చేసుకున్న పవన్‌కల్యాణ్ కూడా తరచూ చంద్రబాబు వెంట పరుగెత్తడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
చంద్రబాబును సీఎం చేయాలని కలలు కంటున్న పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు తన అనుకూల మీడియాధిపతితో కలం పోటు పొడిపించారనే ప్రచారం జరుగుతోంది. పవన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు కుదుర్చుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో కలవనీయకుండా చేయాలనే ఎత్తుగడ వేశారని బాబు భక్త జర్నలిస్టు కలం నుంచి ఆణిముత్యాల్లాంటి రాతలు రాలాయి.
ఇంత కాలం వైసీపీ నేతల విమర్శలకు సదరు వారాంతపు జర్నలిస్టు, మీడియాధిపతి రాతలు బలం కలిగించాయి. దీంతో జనసైనికులు గగ్గోలు పెడుతున్నారు. బాబును సీఎం చేయాలని తనను తాను అర్పించుకునేందుకు సిద్ధమైన పవన్‌కు ఈ మాత్రం వాతలు పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వెయ్యి కోట్ల ఆఫర్ అంటూ తప్పుడు వార్తలు రాశారని జనసైనికుల ఆవేదన తప్ప, అసలైన నాయకుడి నుంచి కనీస స్పందన కరువైందనే విమర్శలేకపోలేదు. పవన్‌కల్యాణ్‌కు లేని బాధ, వీళ్లకెందుకని టీడీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి. పవన్‌ను మరీ గుడ్డిగా ఆరాధించడం ఇప్పటికైనా మానుకోవాలని టీడీపీ శ్రేణులు హితవు చెబుతున్నాయి. ఇంతకాలం జగన్‌పై వారాంతపు పలుకుల సార్ రాసే రాతల్లో ఎంత మాత్రం సత్యం వుందో… ఇప్పటికైనా జనసైనికులకు అర్థమై వుంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
మొత్తానికి పవన్‌ను కలం పోటు పొడవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే బాబును ప్రేమించే జర్నలిస్టే పవన్ గురించి రాశారంటే… అందులో నిజం ఉండే వుంటుందనే చర్చ లేకపోలేదు. పవన్ ప్యాకేజీ స్టార్ అని వాదించే వాళ్లకు వీకెండ్ జర్నలిస్టు రాతలు భలే నచ్చేస్తున్నాయి.