రివర్స్ టెండరింగ్.. ఈసారి 67 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అత్యుత్తమమైన ఆలోచన. దీని వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందనే విషయం ఎప్పటికప్పుడు కళ్లముందు కనిపిస్తూనే ఉంది. తాజాగా ఈ ప్రక్రియ ద్వారా…

రివర్స్ టెండరింగ్.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అత్యుత్తమమైన ఆలోచన. దీని వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందనే విషయం ఎప్పటికప్పుడు కళ్లముందు కనిపిస్తూనే ఉంది. తాజాగా ఈ ప్రక్రియ ద్వారా మరో 67 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసి చూపించారు ముఖ్యమంత్రి.

సోమశిల హై-లెవెల్ కెనాల్ పనులకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది జగన్ సర్కార్. ఈ రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా 67 కోట్ల 90లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసింది. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వం 527.53 కోట్ల రూపాయల పనులను పెట్టగా.. 459.63 కోట్ల రూపాయలకే టెండర్ ను దక్కించుకుంది ఓ సంస్థ. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదా చేకూరింది.

ఈమధ్య స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ పద్ధతినే అనుసరించింది. 317.61 కోట్ల రూపాయలకు రివర్స్ టెండర్ వేయగా, 231.81 కోట్ల రూపాయలకే రివర్స్ టెండరింగ్ లో ప్రాజెక్టు దక్కించుకుంది ఓ సంస్థ. ప్రస్తుతం పోలవరం విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది ప్రభుత్వం.

దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో రివర్స్ టెండరింగ్ కు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తోంది జగన్ ప్రభుత్వం. డిపార్ట్ మెంట్ ఏదైనా, లక్ష రూపాయలు దాటిన ప్రతి టెండర్ లో రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అవలంబిస్తోంది. అలా ఖజానాకు వందల కోట్ల రూపాయలు మిగులుతోంది.