కమల్‌హాసన్…దక్షిణాది సినీ ప్రపంచంలో అగ్రశ్రేణి హీరో. ముఖ్యంగా తెలుగు, తమిళ ప్రజలకు పరిచయం చేయనవసరం లేని విలక్షణ నటుడు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో 2018, ఫిబ్రవరి 21న తమిళనాడులోని మధురైలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ అనౌన్స్ చేశాడు. దాని పేరు మక్కల్ నీథి మైయం (ఎంఎన్ఎం) .
పవన్‌కల్యాణ్…మెగాస్టార్ చిరంజీవి సొంత తమ్ముడు. తెలుగులో అగ్రశ్రేణి హీరోల్లో ఒకడు. రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. అన్న చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు పవన్‌కల్యాణ్ యువరాజ్యం బాధ్యతలు చేపట్టాడు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం కేవలం 18 స్థానాల్లోనే గెలుపొందింది. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్‌లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు.
చిరంజీవి కేంద్రమంత్రి అయ్యాడు. తమ్ముడు పవన్‌కల్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అయితే రాజకీయాలు ఆయన్ను విడిచి పెట్టలేదు. దీంతో ఆయన 2014, మార్చి 14న హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని నోవాటెల్‌లో జనసేన పార్టీని ప్రకటించాడు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ మిత్రపక్షానికి మద్దతు ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని కేవలం ఒక్క సీటు సాధించాడు. కానీ తాను నిలిచిన రెండు చోట్ల ఓడిపోవడం గమనార్హం.
మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా కమల్ ఏం చేస్తున్నాడంటే…
ప్రస్తుతం దేశాన్ని అట్టుడికిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి (సీపీఏ) వ్యతిరేకంగా కమల్‌హాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం పార్టీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మతపరమైన మైనార్టీలకు ప్రత్యేక రక్షణ కల్పించేలా చట్ట సవరణ ఉందని, భాషాపరమైన మైనార్టీలకు మినహాయిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, మతం ఆధారంగా వర్గీకరణ సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇది రాజ్యాంగంలోని 14, 21వ అధికరణలను ఉల్లంఘించడమేనని పార్టీ తన వాదన వినిపించింది. ఈ కారణాలతో పౌరసత్వ సవరణ చట్టం చెల్లదంటూ ఆదేశాలు ఇవ్వాలని కమల్ తన పార్టీ తరపున సుప్రీంను కోరాడు.
బీజేపీలో విలీనం కోసం పవన్ పాట్లు
ఈయన నిన్నమొన్నటి వరకు చెగువేరా జపం చేసేవాడు. ఇప్పుడు ఆయనకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలో ఓ చెగువేరా, నెల్సన్‌మండేలాలు కనిపిస్తున్నారట. అమిత్‌షానే ఈ దేశానికి సరైన నేత అని కితాబిస్తున్నాడు. బీజేపీ ఎజెండాను తన అజెండాగా మార్చుకుని సీఎం జగన్ మతమార్పిళ్లకు పాల్పడుతున్నాడని దుష్ప్రచారం చేస్తున్నాడు. తానొక హిందుత్వ ఉద్ధారకుడిగా అభివర్ణించుకుంటున్నాడు.
ఇటీవల ఈయన కూడా ఢిల్లీ వెళ్లి వచ్చాడు. కమల్‌హాసన్ సుప్రీంకోర్టులో కేసు వేయడానికి వెళ్లినట్టు, పవన్ కూడా ఏదైనా ప్రజాసమస్యపై దేశ రాజధానిలో అడుగు పెట్టాడని పొరపాటున కూడా అనుకోవద్దు. త్వరలో బీజేపీలో జనసేనను విలీనం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు తీవ్రతరం చేశాడనే టాక్ వినిపిస్తోంది.
కమల్, పవన్ మధ్య తేడాః
వైవాహిక జీవితాల విషయానికి వస్తే పవన్, కమల్ మధ్య పెద్ద తేడాలేదు. ఇద్దరి జీవితాల్లోనూ ముగ్గురు మహిళల ప్రవేశం. కమల్‌హాసన్ పార్టీ పెట్టి 22 నెలలైంది. పవన్ పార్టీని స్థాపించి ఐదేళ్ల తొమ్మిది నెలలైంది. కమల్‌హాసన్ పెద్దగా ఆదర్శాల గురించి మాట్లాడడు. పాలకుల విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయనుకుంటే ఎంతటి వారిపైనైనా విమర్శలు చేస్తాడు. ఎవరికీ భయపడని తత్వం.
పవన్ మాటలు కోటలు దాటుతాయి. గద్దర్, శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్రశర్మ, బాలగంగాధర్ తిలక్, శివారెడ్డి తదితర కవుల స్ఫూర్తిదాయక కవితలను బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ మేధావి ఫోజు పెడుతుంటాడు. దేశంలో అగ్గిరాజేస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి (సీపీఏ) వ్యతిరేకంగా కమల్ న్యాయపోరాటం చేస్తుంటే, ఈయన మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయిస్తున్న చందంగా…అంతా అయిపోయాక కలుగు నుంచి బయటకి వస్తాడు. నిజానికి ఇప్పుడు ఏపీలో ముస్లింల ఆందోళనను పట్టించుకునే పార్టీ, నేతలెవరూ లేరు. పార్టీని బలోపేతం చేసుకునేందుకు పవన్‌కు మంచి అవకాశం లభించినా …జగనే తనకు ప్రధాన సమస్య అయినట్టే అతను వ్యవహరిస్తున్నాడు.
22 నెలల క్రితం పార్టీని స్థాపించిన సాటి సీనియర్ హీరో కమల్ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుంటే, పవన్ మాత్రం పార్టీని విలీనం చేసేందుకు బీజేపీతో బేరం ఆడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అమిత్‌షాపై కురిపిస్తున్న ప్రేమ…అందుకు బలం చేకూరుస్తున్నాయి. కమల్ పోరాటం నుంచైనా ప్రజాసమస్యలపై ఎలా స్పందించాలో నేర్చుకుంటే పవన్ రాజకీయ భవిష్యత్‌కు మంచిది.