దాదాపు ఏడేళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. చెప్పుకోడానికి 2 హిట్స్ తప్ప ఇంకేం లేవు. రీసెంట్ గా అయితే రెండేళ్ల నుంచి ఒక్క హిట్ కూడా లేదు. ఇలాంటి టైమ్ లో తాజాగా వచ్చిన ఓ సినిమా ఓ మోస్తరుగా ఆడడంతో సదరు హీరోయిన్ కు కొమ్ములొచ్చాయి. తన సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టు కలరింగ్ ఇస్తోంది ఆ ముద్దుగుమ్మ. సినిమా హిట్ అని చెప్పుకుంటే తప్పులేదు, నెక్ట్స్ సినిమాకు ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. దీంతో అంతా అవాక్కయ్యారు.
ఓ పెద్ద బ్యానర్ లో ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. అందులో ఓ సినిమా కోసం సదరు హీరోయిన్ ను సంప్రదించారు. గతంలో ఇదే బ్యానర్ పై సినిమా చేస్తే ఆమెకు 30 లక్షలు ఇచ్చారు. సో.. ఈసారి 50 లక్షలు ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆమె ఏకంగా కోటి డిమాండ్ చేసేసరికి ఏం మాట్లాడాలో అర్థంకాలేదు ఆ యంగ్ ప్రొడ్యూసర్ కు. సైలెంట్ గా అక్కడ్నుంచి జారుకున్నాడు.
ప్రస్తుతం ఆమె తన సినిమా సూపర్ హిట్ అని, పైగా తన కోసం ఆఫర్లు క్యూ కడతాయనే భ్రమలో ఉంది. ఆమె నటించిన సినిమా యావరేజ్ గానే ఆడుతోందని, మరోవైపు ఆమె కెరీర్ కూడా చరమాంకానికి వచ్చేసిందనే విషయాన్ని ఆమె గ్రహించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.
ఇవన్నీ ఒకెత్తయితే.. తాజాగా విదేశాలకు వెళ్లి దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి ముఖానికి ఏదో ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ చేయించుకుందామె. కలల ప్రపంచంలో బతికేయడం అంటే ఇదేనేమో.