ఇదేమీ రాంగోపాల్‌వర్మ సినిమా టైటిల్ కాదు. అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమాలో ‘పప్పులాంటి అబ్బాయి, శుద్ధ పప్పు చిన్నారి. బాధ నేను పడుతున్నా… చెప్పుకోలేకున్నాఅని ’ పాటలోని చరణం అంతకంటే కాదు. రాంగోపాల్‌వర్మ సినిమాలో చంద్రబాబు పాత్రధారి తన కుమారుడికి ప్లేట్‌లో పప్పు వడ్డిస్తున్న సీన్ అంతకన్నా కాదు…కాదు. ‘మరేంటి’ అని ప్రశ్నిస్తున్నారా?
అక్కడికే వస్తున్నాను. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆరోరోజు పది బిల్లులకు పైన్నే అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా సంబంధిత మంత్రులు ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేశారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చిరు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు, వాటిని పండించే రైతులకు మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు వేర్వేరు బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశ పెట్టాడు.
ఈ సందర్భంగా కన్నబాబు ‘పప్పు’ అని ప్రసంగాన్ని మొదలు పెట్టగానే పాలక పక్ష సభ్యుల నుంచి సెటైర్లు వినిపించాయి. దీంతో కన్నబాబు నవ్వు ఆపుకోడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ‘పప్పు’పై రన్నింగ్ కామెంట్రీ చేస్తున్న సభ్యుల వైపు ఆయన తిరిగి…వద్దన్నంటూ సైగలు చేశాడు. కన్నబాబు తన ప్రసంగంలో రాష్ట్రంలో ‘పప్పు’, చిరుధాన్యాలను పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ధరలు పెరగకుండా నియంత్రించడం, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం కోసమే ‘పప్పు’, చిరుధాన్యాల బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పాడు. ప్రసంగంలో ‘పప్పు’ అని వచ్చినప్పుడల్లా పాలక పక్ష సభ్యుల నుంచి పరోక్షంగా లోకేశ్‌ను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడినట్టు అసెంబ్లీలో వెల్లువెరిసిన నవ్వులు తెలియజేశాయి.
ఇదే సందర్భంలో ప్రతిపక్ష సభ్యుల నుంచి గన్నేరు ‘పప్పు’ అని సెటైర్లు కూడా వినిపించాయి. ఇటీవల లోకేశ్ ప్రెస్‌మీట్ పెట్టి తాను ‘పప్పు’ అయితే సీఎం జగన్ గన్నేరు పప్పా? అని ప్రశ్నించాడు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లోనూ, వర్మ పుణ్యమా అని సినిమాల్లోనూ ‘పప్పు’ ట్రెండింగ్ టాఫిక్‌గా నిలిచింది.