కొత్త వేరియంట్ క‌ట్ట‌డికి…అవ‌స‌ర‌మైతే!

దేశంలో క‌రోనా మూడో వేవ్ పొంచి వుంద‌ని వైద్య వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి రూపు మార్చుకుని వ‌స్తోంది. కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఇదే సంద‌ర్భంలో…

దేశంలో క‌రోనా మూడో వేవ్ పొంచి వుంద‌ని వైద్య వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి రూపు మార్చుకుని వ‌స్తోంది. కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఇదే సంద‌ర్భంలో రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ కీల‌క లేఖ రాసింది. ఇందులో కొత్త వేరియంట్ క‌ట్ట‌డికి చేప‌ట్టాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల గురించి వివ‌రంగా రాసుకొచ్చారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కోవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ లేఖ‌లో దేశంలో క‌రోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు.

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరిగింద‌ని పేర్కొన్నారు. క‌రోనా వ్యాపిస్తున్న జిల్లాల‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని  లేఖలో స్ప‌ష్టం చేశారు. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మిగిలిన‌ 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు మ‌రోసారి పాత నిబంధ‌న‌ల‌ను కేంద్ర ఆరోగ్య‌శాఖ తెర‌పైకి తెచ్చింది. ఏ జిల్లాలో నైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగితే, వెంటనే  ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచాల‌ని సూచించారు. కంటై న్మెంట్‌ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాల‌ని ఆదేశించారు. జన సమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్ప‌ష్టం చేశారు.