తమిళనాడు హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ్ కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. సాయితేజ్ కుటుంబానికి రూ.50లక్షల సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని సీఎం కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది.
అమర వీరుడి కుటుంబ సభ్యుల్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించారు. సాయితేజ్ భార్య, తల్లిదండ్రుల్ని ఆయన ఓదార్చారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున రూ.50 లక్షల చెక్కును ఆయన అందజేశారు. ఇదే కాకుండా ఇతరేతర సహాయ సహకారాన్ని తమ ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా వుండగా శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయితేజ్ భౌతికకాయాన్ని మిలటరీ అధికారులు గుర్తించారు.
అనంతరం మృతదేహాన్ని సాయితేజ్ స్వగ్రామానికి మిలటరీ లాంఛనాలతో తరలించారు. కాసేపట్లో చిత్తూరు జిల్లాలోని ఎగువరే గడకు భౌతికకాయం చేరనుంది. అనంతరం కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.