కాస్త ఆలస్యమైనా ఆ ఇద్దరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేశారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, అలాగే పల్నాడు నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవుల్ని జగన్ కట్టబెట్టారు. స్థానిక సంస్థల కోటా నుంచి 9 స్థానాలు, అలాగే ఎమ్మెల్యే కోటా నుంచి 7, గవర్నర్ కోటా 2 స్థానాలకు పేర్లను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రకటించారు.
అభ్యర్థుల ఎంపికలో వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం కల్పించారు. సహజంగానే బీసీలకు ఆయన పెద్ద పీట వేశారు. అలాగే ఒక రెడ్డి, ఒక కమ్మ నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్థానిక సంస్థల కోటాలో తన సొంత జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, అలాగే ఎమ్మెల్యే కోటాలో చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్‌కు ఈ దఫా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం విశేషం.
గత సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైన జమ్మలమడుగులో ఒక వర్గానికి రామసుబ్బారెడ్డి కుటుంబం నాయకత్వం వహించేది. కాలక్రమంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బద్ధశత్రవులైన మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు కలిసిపోయారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారడంతో జమ్మలమడుగులోనూ ఆ ప్రభావం పడింది.
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల ముందు మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజినీకి చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. రజినీని గెలిపించుకొస్తే.. మర్రికి ఎమ్మెల్సీ తో మంత్రి పదవి ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు.
తాజాగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ పదవులు వైసీపీకి దక్కుతుండడంతో ఇచ్చిన మాట ప్రకారం రామసుబ్బారెడ్డి, మర్రి రాజశేఖర్‌కు పదవులు ఇవ్వగలిగారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదు. కనీసం ఎమ్మెల్సీతోనైనా జగన్ సరిపెట్టారు.