విజ‌య‌సాయిలో మార్పు…శ‌త్రువు ప్ర‌శంసించేంత‌గా!

వైసీపీ ప్ర‌ముఖ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిలో కొంత కాలంగా చాలా మార్పు క‌నిపిస్తోంది. ఇది మంచికే కావ‌డం శుభ‌ప‌రిణామం. విజ‌య‌సాయిరెడ్డిలో ఎంత మార్పు వ‌చ్చిందంటే… రాజ‌కీయంగా బ‌ద్ధ‌శ‌త్రువులుగా ప‌ర‌స్ప‌రం తిట్టుకునే వైసీపీ రెబ‌ల్ ఎంపీ…

వైసీపీ ప్ర‌ముఖ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిలో కొంత కాలంగా చాలా మార్పు క‌నిపిస్తోంది. ఇది మంచికే కావ‌డం శుభ‌ప‌రిణామం. విజ‌య‌సాయిరెడ్డిలో ఎంత మార్పు వ‌చ్చిందంటే… రాజ‌కీయంగా బ‌ద్ధ‌శ‌త్రువులుగా ప‌ర‌స్ప‌రం తిట్టుకునే వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ప్ర‌శంసించేంత‌గా. వివిధ మీడియా సంస్థ‌ల వేదిక‌గా విజ‌య‌సాయిరెడ్డి, ర‌ఘురామ‌కృష్ణంరాజు ప‌ర‌స్ప‌రం దారుణంగా తిట్టుకున్న ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో.

క‌నీసం వాటి గురించి రాత‌ల్లో రాయ‌లేని ప‌రిస్థితి. అలాగే మాట‌ల్లో చెప్ప‌లేని దుస్థితి. ఈ నేప‌థ్యంలో మొద‌టిసారిగా రఘు రామ‌కృష్ణంరాజు త‌న శ‌త్రువైన విజ‌య‌సాయిరెడ్డిని అభినందించ‌డం విశేషం. దీన్నిబ‌ట్టి విజ‌య‌సాయిరెడ్డిలో ఎంత మార్పు వ‌చ్చిందో అర్థం చేసుకోవ‌చ్చు. అలాగే విజ‌య‌సాయిరెడ్డి, చంద్ర‌బాబు ప‌ర‌స్ప‌రం స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో మాట్లాడుకోవ‌డాన్ని ఆయ‌న అభినందించారు.

ఇవాళ ర‌ఘురామ‌కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ విజ‌య‌సాయిరెడ్డి గ‌తంలో ద‌రిద్ర‌పు ట్వీట్స్ చేసేవార‌న్నారు. విజ‌యసాయిరెడ్డి ట్విట‌ర్‌ను ఎవ‌రో హ్యాండిల్ చేసి వుంటార‌న్నారు. గ‌త రెండు నెల‌ల నుంచి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ల‌లో మార్పు క‌నిపించింద‌న్నారు. తార‌క‌ర‌త్న నివాసానికి చంద్ర‌బాబు వెళ్లిన సంద‌ర్భంలో విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు అభినంద నీయ‌మ‌ని ప్ర‌శంస‌ల‌తో ర‌ఘురామ ముంచెత్తడం విశేషం. 

దీన్ని ఏ మాత్రం రాజ‌కీయ కోణంలో చూడ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. ఒక నాయ‌కుడికి ఎంత గౌర‌వం ఇవ్వాలో అంతే గౌర‌వం విజ‌య‌సాయిరెడ్డి ఇచ్చార‌ని ర‌ఘురామ అభినందించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ర‌ఘురామ ప్ర‌శంసించే స్థాయిలో విజ‌య‌సాయిరెడ్డిలో మార్పు వ‌చ్చింద‌బ్బా అంటూ వైసీపీ శ్రేణులు స‌ర‌దా కామెంట్స్ చేస్తున్నాయి.