వైసీపీ ని కార్నర్ చేసిన పవన్ కల్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎవరెంత యాగీ చేసినా కేంద్రం మాత్రం వెనకడుగు వేసేది లేదని చెబుతోంది. నష్టాల ప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేస్తామంటోంది. అయితే ప్రైవేటీకరణ పేరుతో స్టీల్…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎవరెంత యాగీ చేసినా కేంద్రం మాత్రం వెనకడుగు వేసేది లేదని చెబుతోంది. నష్టాల ప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేస్తామంటోంది. అయితే ప్రైవేటీకరణ పేరుతో స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని కాజేసేందుకు కేంద్రం ఎత్తుగడ వేసిందనేది ప్రతిపక్షాల వాదన. 

వైసీపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఈ తీర్మానాల విలువ ఎంతో అందరికీ తెలిసిందే. అదే సమయంలో పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ నుంచి వచ్చిన స్పందన కాస్త తక్కువేనని చెప్పాలి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాజకీయంగా వాడుకోవాలని, అటు కేంద్రాన్ని పెద్దగా ఇరుకున పెట్టకుండా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేది ఏపీలోని ప్రతిపక్షాల వ్యూహం. దానికి అనుగుణంగానే టీడీపీ ఈ ఉద్యమానికి పరోక్ష మద్దతిస్తూనే కేంద్రం ఉపసంహరించుకోవాల్సిన నిర్ణయానికి రాష్ట్రాన్ని తప్పుబడుతోంది. 

అటు పవన్ కల్యాణ్ ది కూడా అదే దారి. పవన్ కూడా కేంద్రంపై ఒత్తిడి తేకుండా.. రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పంటున్నారు. గతంలో ఓసారి విశాఖ వెళ్లి మద్దతు తెలిపిన పవన్ ఈ సారి మాత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తానంటున్నారు.

సింగిల్ డే దీక్షలతో లాభమేంటి..

సింగిల్ డే దీక్షలను చంద్రబాబు కనిపెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్త కడుపు ఖాళీ చేసుకోడానికి ఈ దీక్షలు ఉపయోగపడతాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా బాబు బాటలో దీక్షలు చేస్తామంటున్నారు. ఈ సింగిల్ డే దీక్షల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంటుందా లేదా అనేది ప్రశ్నార్థకం. 

కేంద్రం ఎలాగూ వెనక్కి తీసుకోదు కానీ, పవన్ అనుకున్నది మాత్రం సాధిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మరోసారి పవన్ కల్యాణ్ డిమాండ్ చేసే అవకాశం ఉంది.

ఏపీ సర్కారు స్పందించక తప్పదు

పవన్ దీక్షతో వైసీపీ మరోసారి స్టీల్ ప్లాంట్ అంశంపై స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిన తర్వాత.. పార్లమెంట్ సమావేశాల్లో కూడై వైసీపీ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. అంతకంటే ముందు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధానికి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా కొన్ని సూచనలు కూడా చేశారు.

అయితే ఇవన్నీ అయిపోయాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పుడు వైసీపీ ఏం చేస్తోందనేదే అసలు ప్రశ్న. రేపు పవన్ ఎక్కుపెట్టే రాజకీయ వాగ్బాణాలకు వైసీపీ తప్పనిసరిగా స్పందించాల్సి ఉంటుంది. అసెంబ్లీ తీర్మానం, ప్రధానికి లేఖ, పార్లమెంట్ లో ప్రకార్డుల ప్రదర్శన కాకుండా.. ఇంకా కొత్తగా ఏపీ సర్కారు ఏం చేసిందనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

తన కార్యాచరణ ఏంటో చెప్పాలి. ఎందుకంటే, స్టీల్ ప్లాంట్ అంశంపై ఏం చేయాలన్నా అది అధికార పార్టీ వైసీపీకే సాధ్యం.