తను రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా దేశభక్తి కంటెంట్ కాదని స్పష్టం చేశారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమాలో దేశభక్తి డైలాగులు కానీ, అలాంటివేమీ ఉండవని.. తన సినిమా పూర్తిగా స్నేహం మీదే సాగుతుందన్నారు. ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ మీద రూపొందిన సినిమానే తప్ప ఇది దేశభక్తి సినిమా కాదని దర్శకుడు స్పష్టత ఇచ్చాడు.
బ్రిటీష్ ఇండియా కాలం నాటి సెట్టింగులు, కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పేర్లను వాడుకుంటూ రూపొందిన ఈ సినిమా గురించి దర్శకుడు ఈ తరహాలో స్పష్టతను ఇవ్వడం గమనార్హం. దేశభక్తి సినిమా కాదు అని రాజమౌళి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో.. స్వతంత్ర పోరాటంలో అల్లూరి పాత్రను ఎలా చూపారనేది కన్ఫ్యూజన్ తో కూడుకున్న అంశంగా మారుతోంది.
దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, గోండుల బతుకుల కోసం పోరాడిన కొమురం భీమ్ ల పేర్లను వాడుకున్న సినిమా దేశభక్తి సినిమా కాదని దర్శకుడు చెప్పారు. దాదాపు సమకాలీనులు కాని మహనీయుల మధ్య స్నేహం ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టుగా కూడా దర్శకుడే స్పష్టతను ఇచ్చారు.
వారి గురించి తామెంతో మేధోమధనం చేసి.. ఈ కాన్సెప్ట్ ను రెడీ చేసుకున్నట్టుగా చెప్పారు రాజమౌళి. ఈ సినిమా పూర్తిగా ఫిక్షనల్, కంప్లీట్ గా క్రియేషన్ అని రాజమౌళి స్పష్టం చేశారు. ట్రైలర్ తోనే తామెంతో కథను వివరించినట్టుగా రాజమౌళి చెప్పుకొచ్చారు.
ఇద్దరు మహనీయులతో స్టెప్పులు వేయించాలనే విమర్శలను తాము ఎక్స్ పెక్ట్ చేశామని, సినిమా చూసిన తర్వాత అందరికీ సమాధానాలు దొరుకుతాయన్నారు. ఇక ఇద్దరు హీరోల ఇమేజ్ బ్యాలెన్స్ విషయంలో కూడా తను జాగ్రత్తలు తీసుకున్నట్టుగా రాజమౌళి స్పష్టం చేశారు.