సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పెద్ద ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తన మీడియా సహకారంతో ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఆయనపై లేనిపోని విమర్శలు చేయించారు.
వైశ్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పులు వేయించారు. ఆ టైమ్ లో ఎన్టీఆర్ కొడుకులు కూడా చంద్రబాబుకే మద్దతు తెలిపారు. తండ్రిని పట్టించుకోలేదు. ఇది చరిత్ర, అందరికీ తెలిసిన నిజం. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ బాలయ్య మాత్రం ఈ చరిత్రను ఒప్పుకోవడం లేదు. వెన్నుపోటుకు కొత్త భాష్యం చెబుతున్నారాయన.
“ఎన్టీఆర్ ను ఆయన పిల్లలు సరిగ్గా చూసుకోలేదు, వెన్నుపోటు పొడిచారు అని చాలామంది అన్నారు. ఎవరో ఏదో 10 సార్లు చెబితే జనాలు పిచ్చోళ్లలా అలా వినేస్తారు. ఆ టైమ్ లో పార్టీని కాపాడుకోవడం కోసం మేం బావగారి సైడ్ ఉన్నాం. మా నాన్నగారు అంటే మాకు ప్రేమ లేదా? ఈ మాటలు చెబుతుంటే నా కళ్లలో నీళ్లొస్తున్నాయి.”
ఇలా వెన్నుపోటుకు తనదైన అర్థం చెప్పారు బాలయ్య. అయినా కుటుంబాన్ని, రాజకీయాల్ని ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కుటుంబం వేరు, రాష్ట్రం వేరు, రాజకీయం వేరని.. వీటిని ఒకే గాటన కట్టేసి గొడవ చేయడం కరెక్ట్ కాదంటున్నారు.
“మా తండ్రిని అందరికంటే ఎక్కువగా నేనే కోల్పోయాను. చిన్నప్పట్నుంచి ఆయన దగ్గర పెరగలేదు. ఆయన మద్రాసులో ఉంటే, మేం హైదరాబాద్ లో చదువుకున్నాం. ఆయన హైదరాబాద్ వచ్చిన టైమ్ కు, మేం సినిమాల కోసం మద్రాసు వెళ్లాం. ఇలా తండ్రిని చాలా కోల్పోయాం. నేను ఆయన కొడుకుల్లో ఒకడ్ని మాత్రమే కాదు, ఆయన ఫ్యాన్స్ లో కూడా ఒకడ్ని.”
ఇలా తండ్రిపై తన ప్రేమను చాటుతూనే, అప్పటి ఘటన వెన్నుపోటు కాదంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. తన తండ్రి ఎవరిపై ఆధారపడలేదని, నిండైన వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు.
ఇన్ని చెప్పిన బాలయ్య.. అదే నోటితో, గతంలో తన తండ్రి ఎన్టీఆర్, చంద్రబాబును కెమెరా సాక్షిగా తిట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. నమ్మకద్రోహి, వెన్నుపోటు పొడిచాడు లాంటి పదాల్ని ఆనాడు చంద్రబాబును ఉద్దేశించి, స్వయంగా ఎన్టీఆర్ వాడారు. వాటికి కూడా బాలకృష్ణ, కొత్త భాష్యం చెబుతారేమో.