రెండు రోజుల కిందట కూడా నందమూరి బాలకృష్ణ ప్రస్తావనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలో తీసుకు వచ్చారు. రెండు అంశాల విషయంలో బాలకృష్ణ ప్రస్తావన వచ్చింది. అందులో ఒకటి రాయలసీమ ప్రాజెక్టుల మీద చర్చను తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టగా, ఆ సమయంలో బాలకృష్ణ మాట్లాడితే బావుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు.
రాయలసీమ ప్రాజెక్టుల గురించి కోస్తా ఎమ్మెల్యేలు మాట్లాడటం ఏమిటని, రాయలసీమ నుంచి టీడీపీ తరఫున గెలిచిన వారు మాట్లాడితే బావుంటుందని వారు అన్నారు. అయితే బాలయ్య సభలో లేరు. ఉదయం సభకు వచ్చారట. బయట ఏదో ఉల్లిపాయల డ్రామా ప్రోగ్రామ్ లో పాల్గొని..అటు నుంచి అటే వెళ్లిపోయారట. దీంతో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడింది.
ఇక మహిళలపై అత్యాచారాలు, దిశ చట్టం గురించి చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డైరెక్టుగా బాలకృష్ణ ప్రస్తావన చేశారు. ఆడవాళ్ల గురించి గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. దిశ చట్టంపై చర్చను చంద్రబాబు నాయుడు అసలు కోరుకోవడం లేదని.. ఆ అంశంపై చర్చ జరిగితే..'ఆడది కనిపిస్తే కడుపైనా చేయాలి..' అంటూ గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను రోజా గుర్తు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ చేసిన అలాంటి వ్యాఖ్యలు సభలో చర్చకు వస్తాయనే దిశ చట్టంపై చర్చను చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు.
ఇలా నందమూరి బాలకృష్ణ మీద ఆర్కే రోజా డైరెక్ట్ అటాక్ సాగింది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో రోజాను నటింపజేయాలని అనుకుంటున్నారట. అది కూడా లేడీ విలన్ గా! బాలకృష్ణ సినిమాల్లో లేడీ విలన్లు ఏమీ కొత్త కాదు. కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో రోజా గత కొన్నేళ్లలో నటించింది కానీ, డైరెక్టుగా విలన్ గా చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే హీరోగా నటిస్తున్న సినిమాలో అధికార పార్టీ ఎమ్మెల్యే విలన్ గా నటిస్తుందా? అవి పాత్రలుగానే తీసుకుని ఆమె చేస్తారా.. లేక నో అంటారో చూడాలి! హీరోహీరోయిన్లుగా వీరిది సక్సెస్ ఫుల్ పెయిర్ అని వేరే చెప్పనక్కర్లేదు.