ఆఖరిచూపులు..అంత్యక్రియలు ఎప్పుడో..?

మరణం ఎలా సంభవించినా అది కన్నవారికి, సంబంధిత వ్యక్తుల కుటుంబ సభ్యులకు జీవితాంతం గుండెకోతే. మనం ఒక మనిషిని కోల్పోతే అందుకు ప్రత్యామ్నాయం అనేది ఉండదు. మనషులు ప్రమాదాల్లో చనిపోయినా, మరో విధంగా మరణించినా…

మరణం ఎలా సంభవించినా అది కన్నవారికి, సంబంధిత వ్యక్తుల కుటుంబ సభ్యులకు జీవితాంతం గుండెకోతే. మనం ఒక మనిషిని కోల్పోతే అందుకు ప్రత్యామ్నాయం అనేది ఉండదు. మనషులు ప్రమాదాల్లో చనిపోయినా, మరో విధంగా మరణించినా బాధను దిగమింగుకొని మృతదేహాలను దహనం చేయడమో, ఖననం చేయడమో చేస్తారు. వారు లేని బాధను క్రమంగా తగ్గించుకుంటారు. కాని మృతదేహాలు రోజుల తరబడి అలాగే (మార్చురీలో) ఉన్నప్పుడు, వాటికి అంత్యక్రియలు చేయలేక నిస్సహాయంగా ఉన్నప్పుడు కన్నవారు, వారి కుటుంబ సభ్యులు పడే ఆవేదన, గుండెకోత ఎలా ఉంటుందో ఊహించుకోండి.  

దిశ హత్యాచారం కేసులో నిందితులై, పోలీసు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన నలుగురి కుటుంబ సభ్యుల పరిస్థితి హృదయవిదాకరంగా ఉంది. ఈ నలుగురి కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయి. రెక్కాడితేగాని డొక్కాడదు. తమ బిడ్డలు చేసిన పని ఘోరమైన తప్పనే వారూ అంటున్నారు. కాని వారిని విచారించి, శిక్ష వేయకుండా ఇలా చంపడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు నలుగురూ దుర్మార్గులే. కాని పట్టుకొచ్చి ఉద్దేశపూర్వంగా కాల్చిపారేస్తే కన్నవారి హృదయాలు రోదించకుండా ఎందుకుంటాయ్‌? వారి గుండెలు తల్లడిల్లకుండా ఎలా ఉంటాయ్‌? 

పోనీ జరిగిందేదో జరిగిపోయిందనుకొని మృతదేహాలకు అంత్యక్రియలు ముగిస్తే ఒకలాగా ఉండేది. కాని ఆ నాలుగు మృతదేహాలు ఆస్పత్రి మార్చురీలో ఉన్నాయి. ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం హైదరాబాదుకు వచ్చి ఆ మృతదేహాలను పరిశీలించిన తరువాత మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంత్యక్రియలు జరిగిపోతే కుటుంబ సభ్యులకు ఇంత బాధ ఉండదు. శవాలు రోజుల తరబడి మార్చురీలో ఉండటంతో బాధ మరింత పెరుగుతోంది. మనిషి ఏవిధంగా చనిపోయినా డెడ్‌బాడీ వెంటనే పాడైపోవడం ప్రారంభమవుతుంది. 

ప్రాణం పోయిన మరుక్షణం నుంచి మృతదేహం పాడైపోతూ ఉంటుంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత శవాలు కుళ్లిపోతున్నాయనే వార్తలు వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శవాలను పాడైపోకుండా భద్రపరచడం పెద్ద తలనొప్పిగా మారింది. అందులోనూ మన ప్రభుత్వ ఆస్పత్రులు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో తెలిసిందే కదా. ప్రస్తుతం శవాలు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక బాక్సుల్లో ఉంచారు. అవి డీకంపోజ్‌ అవకుండా కొన్ని రసాయనాలు ఎక్కిస్తున్నారు. ఈ ప్రక్రియనే 'ఎంబాల్మింగ్‌'  అంటారు. 

మృతదేహాల్లోకి ఫార్మోల్‌ హెడ్‌, గ్లిజరిన్‌ తదితర రసాయనాలు ఎక్కిస్తారు. ఇదంతా ఫోరోన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతోంది. సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వచ్చి పరిశీలించాక వారు చెప్పినదాన్ని బట్టి సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాల్సివుంటుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం వచ్చాక మృతదేహాలకు రీపోస్టుమార్టం జరుగుతుండొచ్చు. ఇందుకు ఇంకొన్నిరోజులు పడుతుంది. అప్పటివరకు ఈ నలుగురి కన్నవారు, కుటుంబ సభ్యులు క్షోభ అనుభవించాల్సిందే.