పెద్ద హీరోలకు కథలు కావలెను

పెద్ద హీరోలకు, పెద్ద సినిమాలకు కథే పెద్ద సమస్య అయిపోయింది. పలు ప్రాజెక్టులు కథల కోసం చూస్తూ అలా పెండింగ్ లో వున్నాయి. డైరక్టర్లు పెద్ద సమస్య కాదు కొందరికి. డైరక్టర్లు వున్నా కథ…

పెద్ద హీరోలకు, పెద్ద సినిమాలకు కథే పెద్ద సమస్య అయిపోయింది. పలు ప్రాజెక్టులు కథల కోసం చూస్తూ అలా పెండింగ్ లో వున్నాయి. డైరక్టర్లు పెద్ద సమస్య కాదు కొందరికి. డైరక్టర్లు వున్నా కథ సెట్ కావడం లేదు మరి కొన్నింటికి.

మెగాస్టార్ చిరంజీవి తన చేతిలో వున్న భోళాశంకర్ సినిమా చకచకా పూర్తి చేస్తున్నారు. దాని తరువాత సినిమాలు ఒప్పుకోవాలంటే కథలు కావాలి. నిర్మాతలు రెడీగా వున్నారు. కానీ కథలు కావాలి. వాటిని ఏదో దర్శకుడి చేతిలో పెట్టొచ్చు అన్న ధీమా వుంది. సరైన కథ దొరికితే వివి వినాయక్ చేతిలో పెట్టి, మొదలెడదాం అన్న ఆలోచన ఒకటి వుంది. సరైన కథ చూడండి..ఒకటి రెండు మీడియం సినిమాలు చేసిన దర్శకుడైనా ఫరవాలేదు అన్నది మెగాస్టార్ ఆలోచనగా తెలుస్తోంది.

రామ్ చరణ్-నర్తన్ సినిమాకు అదే సమస్య. కథ సెట్ కాలేదు. దాంతో కన్నడంలో ఓ సినిమా చేసి వస్తా అని వెళ్లిపోయాడు. చరణ్ ఆ ప్లేస్ ను బుచ్చిబాబుకు ఇచ్చేసాడు.

నాగార్జున కు కూడా కథే సమస్య. ఒప్పుకున్న ఒకటి రెండు కథలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా వచ్చే వరకు వెయిటింగ్ తప్పడం లేదు.

ఇంకా చాలా మంది హీరోలకు ఇదే సమస్యగా వుంది. కథలు వుంటే చాలు, ఆ మాత్రం ఈ మాత్రం డైరక్టర్ తో అయినా బండి లాగించేయవచ్చు అనే ఆలోచనలో వున్నారు కొంతమంది. మొత్తం మీద కథ కీలకంగా మారింది.